జీతాలు పెంచిన ఇండిగో!

Telugu Lo Computer
0


ఇండిగో తన ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. కరోనా మహమ్మారి ఇబ్బందులు తొలగిన నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పుంజుకుంటున్న కారణంగా ఉద్యోగుల జీతాలను 8 శాతం వరకు పెంచుతున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఎక్కువ పని గంటలు చేస్తున్న పైలట్లకు అదనంగా ఇచ్చే భత్యాన్ని పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎక్కువ గంటలు చేసే వారికి అధిక వేతనం లభించినప్పటికీ, తక్కువ సెలవులు ఉంటాయని సంస్థ పేర్కొంది. ఇండిగో సంస్థ జూలైలో సగటున 1,550 విమాన సర్వీసులను నిర్వహించింది. 2020లో కరోనా మహమ్మారి వల్ల అంతర్జాతీయంగా విమాన సేవలు పూర్తిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం విమానయాన రంగం ఆర్థికంగా చితికిపోయింది. ఈ కారణంగానే ఇండిగో సంస్థ సైతం సిబ్బంది జీతాల్లో 28 శాతం కోత విధించింది. ఇటీవలే ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను తొలగించింది. విమాన సేవల రద్దీ కూడా పెరిగింది. దీంతో ఇండిగో సంస్థ ఉద్యోగుల వేతనాలను పెంచే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఒకమారు 8 శాతం పెంపు నిర్ణయం తీసుకోగా, మరోసారి ఇప్పుడు 8 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండిగోలో పనిచేస్తున్న సిబ్బంది జీతాల పెంపు విషయమై ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఇతర సంస్థలకు మారేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సంస్థ వేతన పెంపు నిర్ణయం తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)