పార్థా చటర్జీపై వేటు

Telugu Lo Computer
0


పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో మంత్రి పార్థా ఛటర్జీ పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేటేశారు. మంత్రి సహాయకురాలు అర్పితా ముఖర్జీ  ఫ్లాట్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడుల్లో కోట్ల రూపాయల అక్రమ నగదు బయటపడుతుండటంతో ముఖ్యమంత్రి మమత ఎట్టకేలకూ స్పందించారు. మంత్రి పదవి నుంచి పార్థా ఛటర్జీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించాక మంత్రిని తొలగించాలని నిర్ణయించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే కేబినెట్ సమావేశంలో పార్థా చటర్జీపై చర్చించకుండానే వేటేసినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవినుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా మమత వెల్లడించారు. తాజా పరిణామాల వెనుక చాలా జరిగిందని అయితే అవన్నీ తాను వెల్లడించాలనుకోవట్లేదని మమత చెప్పారు. అవినీతి ఆరోపణలు రాగానే ఆయనపై వేటేయాల్సిందని బీజేపీ అభిప్రాయపడింది. మంత్రిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆమె మీడియాలో వస్తున్న కథనాలను తప్పుబడుతూపోయారు. చివరకు నిన్న అర్పితాకు చెందిన బెల్గోరియా ఫ్లాట్‌లో ఈడీ అధికారులు జరిపిన దాడుల్లో 29 కోట్ల రూపాయల అక్రమ నగదు దొరకడంతో మమత దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అంతకు ముందే అర్పితా ఫ్లాట్‌లో నల్ల డైరీ దొరకడం కూడా కలకలం రేపింది. ఈ డైరీలో ఎవరెవరి ద్వారా ఏఏ తేదీల్లో ఎంత మొత్తం తీసుకున్నారనే వివరాలున్నాయి. అర్హత లేకున్నా ఎవరెవరికి ఉద్యోగాలిచ్చారో అందులో స్పష్టంగా ఉంది. దీంతో కేసుకు సంబంధం ఉన్న వారి గుట్టు రట్టు కానున్న తరుణంలో ఎట్టకేలకూ మమత.. పార్థా చటర్జీపై వేటేశారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)