నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ !

Telugu Lo Computer
0


లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా నలుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వారు సభలోకి రాకుండా నిషేధం విధించారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై నిరసనలు చేపట్టి సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రథాపన్‌ సభ మధ్యలోకి వెళ్లి నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి కేంద్రానికి వ్యతిరేకంగా సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలను సభ బయట చేపట్టాలని, సభాకార్యకలాపాలకు అడ్డుపడొద్దని స్పీకర్ హెచ్చరించారు. అయినా వారు వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగించడం వల్ల సస్పెన్షన్ వేటు వేశారు. స్పీకర్ చర్యపై కాంగ్రెస్ స్పందించింది. నేతలపై వేటు వేసి ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తోందని ఆరోపించింది. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకే వారు ప్రయత్నించారని పేర్కొంది. సస్పెన్షన్ అనంతరమూ విపక్షాలు ఆందోళనలను కొనసాగించిన నేపథ్యంలో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)