అస్సాంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలు ఉండవు !

Telugu Lo Computer
0


అస్సాంలోని అన్ని ప్రభుత్వ బాలికల పాఠశాలలను కో-ఎడ్యుకేషనల్ స్కూల్స్‌గా మార్చాలని రాష్ట్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. అదే విధంగా సైన్స్, గణితంలను ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ సబ్జెక్టులను అస్సామీస్, బోడో, బెంగాలీలలో బోధిస్తున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను అస్సాం విద్యా శాఖ మంత్రి రోనోజ్ పెగూ మీడియాకు తెలిపారు. చారిత్రక నేపథ్యంగల కొన్ని పాఠశాలలు మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వ బాలికల పాఠశాలలను కో-ఎడ్యుకేషనల్ స్కూల్స్‌గా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ఈ పాఠశాలల్లో బాలికలతో పాటు బాలురు కూడా చదివేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు సైన్స్, గణితంలను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తామని చెప్పారు. ఈ సబ్జెక్టులను అస్సామీస్, బోడో, బెంగాలీ లేదా ఇతర భాషల్లో బోధించబోమని తెలిపారు. అన్ని సబ్జెక్టులను అస్సామీస్, బోడో, బెంగాలీలలో బోధించే పాఠశాలలతోపాటు అన్ని సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించే విధంగా ప్రతి జిల్లాలోనూ దాదాపు 5 నుంచి 10 పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఏ మాధ్యమం కావాలో నిర్ణయించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. సెకండరీ స్కూల్స్‌లో సాంఘిక శాస్త్రానికి బదులుగా, భౌగోళిక శాస్త్రం, చరిత్ర సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 6,000 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, వీటిలో సుమారు 1,800 పాఠశాలలు మాత్రమే ఫీజుల క్రమబద్ధీకరణ అథారిటీ వద్ద రిజిస్టర్ చేయించుకున్నాయని చెప్పారు. మిగిలిన పాఠశాలలు కూడా ఈ విధంగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)