రూ. 600 కోట్ల ఆస్తిని విరాళమిచ్చిన అరవింద్‌ కుమార్‌ గోయల్‌

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ కుమార్‌ గోయల్‌. పేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం తన యావదాస్తిని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తమ కోసం కేవలం ఒకే ఒక్క ఇంటిని ఉంచేసుకొని మిగతా ఆస్తులన్నింటినీ దానం చేశారు. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.600కోట్ల వరకు ఉంటుందట !. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని గోయల్‌ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన గోయల్‌ ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, సామాజికవేత్త. స్థానికంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తోన్న ఆయన,100కు పైగా విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మొరాదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు. గోయల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబసభ్యులు కూడా మద్దతిచ్చారట. ఈ సందర్భంగా అరవింద్‌ గోయాల్‌ మీడియాతో మాట్లాడారు. ''నా సంపదనంతా పేదలకు విరాళంగా ఇవ్వాలని 25 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నా. ఆ రోజు నాకు ఎదురైన ఓ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. పాతికేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ పేద వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు చాలా చలిగా ఉంది. ఆ వ్యక్తి ఒంటిపైన కప్పుకోడానికి ఏమీ లేదు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతడిని చూసి నా మనసు చలించిపోయింది. నాకు చేతనైన సాయం చేశా. కానీ, ఆ తర్వాత నాకు అన్పించింది, ఇలాంటి వాళ్లు దేశంలో ఎంతోమంది ఉంటారు కదా. వాళ్లకు కూడా నావంతు సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా'' అని చెప్పుకొచ్చారు. నాటి నుంచి పేదల కోసం సాయం చేస్తూ వస్తోన్న గోయల్‌.. ఇప్పుడు ఏకంగా ఆస్తినంతా దానం చేయడం విశేషం. గోయల్‌ తండ్రి ప్రమోద్‌ కుమార్‌, తల్లి శకుంతలా దేవి ఇద్దరూ స్వాతంత్ర్యం కోసం పోరాడినవాళ్లే. ఆయన బావ సుశిల్‌ చంద్ర గతంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు. గోయల్ కూడా గతంలో సీబీడీటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన అల్లుడు ఆర్మీలో కర్నల్‌గా పని చేస్తున్నారు. సమాజం కోసం గోయల్‌ చేస్తోన్న సేవలకు మెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు నలుగురు రాష్ట్రపతుల నుంచి ఆయన పురస్కారాలు అందుకోవడం మరో ప్రత్యేకం. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, అబ్దుల్ కలాంలు ఆయన్ను సత్కరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)