ఫోన్‌ స్క్రీన్‌తో తగ్గుతున్న ఆయువు !

Telugu Lo Computer
0


ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పొద్దున్న లేవగానే స్మార్ట్‌ఫోన్‌ పట్టాల్సిందే. ఆ తర్వాతే వేరే ఏ పనైనా.. ఇలా ఎక్కువ సేపు ఫోన్‌ స్క్రీన్‌ను చూస్తే కండ్ల సమస్యలు వస్తాయనే విషయం ఇప్పటి వరకు తెలిసిందే. కానీ, ఫోన్‌ను ఎక్కువ సేపు వాడటం వల్ల ఆయువు తగ్గిపోతుందని అమెరికాలోని బక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసర్చ్‌ ఆన్‌ ఏజింగ్‌లో సంస్థ నిపుణుల అధ్యయనంలో తేలింది. శరీరంలోని అన్ని భాగాలను చర్మం కప్పి ఉంచుతుంది. అయితే కండ్లు మాత్రమే బాహ్య ప్రపంచానికి నేరుగా ఎక్స్‌పోజ్‌ అవుతాయి. అందుకే వాటిని బయటి వాతావరణం నుంచి కాపాడుకునేందుకు కండ్లలో వ్యాధి నిరోధక శక్తి మిగతా అవయవాల కన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. తరచూ ఫోన్‌ తెరను చూస్తే కండ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ సమయాల్లోనే కండ్లను కాపాడుకునేందుకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంటుంది. ఇక ఫోన్‌ తెరను తరుచూ చూస్తే వ్యాధి నిరోధక శక్తి మరింత ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఫోన్లు, కంప్యూటర్లను చూడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అతిగా స్పందిస్తుంటుంది. దీనివల్ల శరీరంలోని అంతర్గతంగా జరిగే ఇతర జీవ క్రియలపై ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా అవయవాలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికోసం ఈగల కండ్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. శరీరంలోని ప్రతి కణం కూడా జీవ గడియారానికి అనుగుణంగా పనిచేస్తుంటుంది. తరచూ ఫోన్‌ లేదా కంప్యూటర్‌ స్క్రీన్‌ను చూడటం ద్వారా ఈ గడియారానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో జీవగడియారంలో మార్పులు జరిగి, దీర్ఘకాలిక వ్యాధులు మరింత ముదిరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కణాలు త్వరగా అలసిపోతాయని, తద్వారా మొత్తం అవయవ వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడి ఆయుష్షు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈగలను పరిశోధకులు రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపు ఈగలకు అన్ని రకాల ఆహారాన్ని అందించారు. రెండో గ్రూపు వాటికి కేవలం 10% ప్రోటీన్‌ ఉన్న ఆహారాన్ని అందజేశారు. రెండో గ్రూపు ఈగల్లోని కండ్లల్లోని ఫొటో రిసెప్టార్లు ఎక్కువగా క్రియాశీలం అయ్యాయి. చీకట్లో ఉంచిన ఈగలు మిగిలిన ఈగల కన్నా ఎక్కువ కాలం జీవించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)