ఎవరీ ఏక్‌నాథ్ షిండే..? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 23 June 2022

ఎవరీ ఏక్‌నాథ్ షిండే..?


మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఏక్‌నాథ్‌ షిండే.. శివసేనలో అగ్ర నాయకుడు. బాల్‌ఠాక్రే హయాంలో అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. చాలాకాలం నుంచి సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు నమ్మిన బంటుగా ఉన్నారు. ప్రస్తుతం మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు. ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గెలిచిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఠాణే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, జనాల్లోనూ నమ్మకం పొందిన నేతగా గుర్తింపు పొందారు. షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీని కష్టపడి నిర్మించింది తానైతే.. ఇప్పుడు హవా అంతా ఉద్దవ్‌ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేదే నడుస్తోందని షిండే కత్తిగట్టినట్లు కనిపిస్తోంది. మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్‌ షిండే స్వస్థలం సతారా. చిన్నప్పుడు ఆర్థిక కారణాలతో రిక్షా, టెంపో డ్రైవర్‌గానూ పనిచేసిన షిండే.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల స్టీరింగ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లో చేరిన ఏక్‌నాథ్ షిండే.. ఆ తర్వాత పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ కీలక నేతగా ఎదిగారు. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. థానే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. అలా శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే.. 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు..బాల్‌ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అయిన ఏక్‌నాథ్‌ షిండే.. తిరుగుబాటు బావుట ఎగురవేయడం వెనక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయ్. తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవి మధ్యలో ఉద్ధవ్‌ ఠాక్రే రావడంతో చేజారిపోయిందని భావించటం ఒకటైతే… హిందూత్వ పార్టీగా పేరుపొందిన శివసేన… బాల్‌ఠాక్రే సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌లాంటి పార్టీలతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రెండోది అని భావిస్తున్నారు. నిజానికి శరద్‌ పవార్‌ దౌత్యం ఫలించి… ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో జతకట్టిన మొదట్లో ఏక్‌నాథ్‌ షిండేకే సీఎం పదవిని దక్కుతుందని అంతా అనుకున్నారు. ఐతే ఏనాడూ ప్రభుత్వ పదవులను ఆశించిని ఠాక్రే కుటుంబం… అకస్మాత్తుగా పదవిని ఆశించడం షిండేకు నిరాశ కలిగించడంతో పాటు.. సీఎం కావాల్సిన తనకు మంత్రివర్గంలో కూడా తగినంత ప్రాధాన్యం దక్కలేదని తీవ్ర అసంతప్తికి గురయ్యారని మరికొందరు అంటున్నారు. ఈ మధ్య జరిగిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను షిండేకు కాకుండా సంజయ్‌రౌత్‌కు అప్పగించడం కూడా… ఆయనకు మరింత అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది . మహారాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎన్సీపీకి చెందిన వ్యక్తి కొనసాగుతున్నారు. దీంతో తమకు అవసరమైన నిధుల విడుదల విషయంలోనూ విపరీతమైన జాప్యం జరగడం కూడా షిండే అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. ఐతే శివసేనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన షిండే.. తనకు సీఎం పదవి ముఖ్యం కాదని అంటున్నారు. పదవుల కోసం తిరుగుబాటు చేయడం బాల్‌ ఠాక్రే తనకు నేర్పలేదనీ.. హిందుత్వం కోసమే తిరుగుబాటు చేస్తున్నాననీ.. శివసేన సిద్ధాంతాలను నమ్ముకున్న 35మంది శాసనసభ్యులు తన వెంట ఉన్నారని అంటున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో శివసేన పొత్తు తెంపుకొని… బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప.. తాను తిరిగి వచ్చేది లేదని ఖరాకండీగా చెప్తున్నారు. ఐతే ఈ విషయంలో ఠాక్రే కుటుంబం కూడా తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పుడు షిండే.. మహావికాస్‌ అఘాడీ సర్కార్‌కు చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ నేత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఏక్‌నాథ్‌ షిండేకు మంచి స్నేహం ఉంది. 2014లో ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో… షిండే కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఫడ్నవీస్‌తో షిండే టచ్‌లో  టచ్‌లో ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. షిండే వెనక కమలం పార్టీ నేతలు ఉన్నారని.. ఆయనను నడిపిస్తోంది కూడా వాళ్లే అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలను తీసుకొని ముందుగా గుజరాత్‌, ఆ తర్వాత అస్సోంకు వెళ్లడం ఈ అనుమానాలకు మరింత తావిస్తోంది. ఆ రెండు కూడా బీజేపీపాలిత రాష్ట్రాలే కావడంతో.. షిండే వెనక కచ్చితంగా కమలం పార్టీ నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment