వైసీపీలోకి "మైహోం" రామేశ్వరరావు?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. విజయసాయిరెడ్డిని తిరిగి రాజ్యసభకు పంపిస్తారా?లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యల కోసం ఎంత పోటీ నెలకొందో ఈ నాలుగు రాజ్యసభ స్థానాల కోసం కూడా పోటీ అంతే తీవ్రంగా ఉంది. కాకపోతే పార్టీ నేతలకన్నా పారిశ్రామికవేత్తలే ఎక్కువగా పోటీపడుతుండటం విశేషం. గతంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌నత్వానీని వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనికోసం ముఖేష్ అంబానీ తాడేపల్లి వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన సతీమణిని రాజ్యసభకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రితో సన్నిహితత్వం ఉండటంతో ఆయన దీనిపై ఇప్పటికే మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి నుంచి హామీ వచ్చిందా? లేదా? అనేదానిపై వీరు చెప్పలేకపోతున్నప్పటికీ ఒక సీటు అదానీకివ్వడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ వ్యాపారవేత్త, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా వైసీపీ కోటాలో రాజ్యసభకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో సంబంధాలు బెడిసికొట్టడంతో ఆయన వైసీపీ తరఫున ఎంపికవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అవసరమైతే తాను అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటానని, పార్టీలో చేరతానని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకటి అదానీకి, మరొకటి జూపల్లి రామేశ్వరరావుకు ఇస్తే మిగిలేవి రెండు సీట్లు. హైదరాబాద్ ఫార్మా రంగంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా రాజ్యసభకు వైసీపీ కోటాలో ఎంపికవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరంతా మొదటి నుంచి దివంగత వైఎస్‌కు, ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌కు సన్నిహితులే. రాజ్యసభ స్థానాల కోసం పారిశ్రామికవేత్తల నుంచి ఇంతస్థాయిలో ఒత్తిడి ఉంటుందని ఊహించని ముఖ్యమంత్రి ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. పాదయాత్ర సమయంలో పార్టీనేతల్లో కొందరికి రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వారంతా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపిస్తారా? లేదంటే పార్టీ నేతలకిచ్చిన హామీని జగన్ నిలబెట్టుకుంటారా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!!

Post a Comment

0Comments

Post a Comment (0)