వాట్సప్‌ వీడియోకాల్‌ ద్వారా వ్యాజ్యం విచారణ

Telugu Lo Computer
0


వినూత్న రీతిలో ఓ కేసు విచారణను మద్రాస్‌ హైకోర్టు జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ వాట్సప్‌ వీడియోకాల్‌లో   నిర్వహించి తీర్పు చెప్పారు. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులున్నాయి. అత్యవసర పిటిషన్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు విచారించేందుకు కొన్ని వెసులుబాట్లను కల్పించారు. ధర్మపురి జిల్లా పాపరపట్టి గ్రామంలో శ్రీ అభీష్ట వరదరాజస్వామి ఆలయ రథోత్సవం సోమవారం నిర్వహించకుండా ఆపేందుకు దేవాదాయశాఖ ఉత్తర్వులిచ్చింది. వాటిని నిలిపేయాలని ఆలయ ధర్మకర్త పీఆర్‌ శ్రీనివాసన్‌ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ వేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు జస్టిస్‌ స్వామినాథన్‌ వాట్సప్‌లో విచారణకు సిద్ధమయ్యారు. ఆదివారం తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ఓ వివాహ వేడుకలో ఉన్నప్పటికీ న్యాయమూర్తి సుముఖత తెలిపారు. న్యాయమూర్తితోపాటు పిటిషన్‌దారు, ఆయన తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఆర్‌.షణ్ముగ సుందరం వీడియోకాల్‌లోకి వచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ మధ్యే తంజావూరు జిల్లాలో రథోత్సవంలో ప్రమాదం జరిగినందున భద్రత దృష్ట్యా ఉత్తర్వులిచ్చినట్లు కోర్టుకు ఏజీ వివరించారు. ఆలయ కమిటీ నిబంధనలు పాటిస్తూ రథోత్సవాన్ని నిర్వహించాలని జస్టిస్‌ స్వామినాథన్‌ ఆదేశించారు. రథం తిరిగే ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఆపేయాలని సూచించారు. భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత దేవాదాయశాఖపై ఉందని ఆదేశించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)