నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన ట్రక్కు : నలుగురు మృతి

Telugu Lo Computer
0


హర్యానాలోని ఝజ్జర్, ఆసోడా టోల్ ప్లాజా సమీపంలో బొగ్గు లోడుతో వెళుతున్న ట్రక్కు  అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రక్కు వేగంగా ఉండటంతో డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అక్కడ నిద్రపోతున్న కూలీలపైనుంచి వెళ్లింది. బహదుర్ గఢ్ లోని ఆసోడా టోల్ ప్లాజా సమీపంలోని కుండ్లి- మానేసర్- పాల్వాల్ ఎక్స్ ప్రెస్ వేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన 18 మంది వలస కూలీలు నిద్రపోతున్నారని పోలీసులు చెప్పారు. గాయపడిన 12 మంది కూలీలను రోహ్ తక్ లోని పీజీఐఎంఎస్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా కాన్పూరుకు చెందిన వాళ్లుగా గుర్తించారు. గాయపడిన వాళ్లలో కాన్పూరు, కన్నౌజ్, ఫరూఖాబాద్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. బ్రిడ్జి రిపేర్ పనుల కోసం వీళ్లంతా వచ్చారు. సైట్ దగ్గర పడుకోవడానికి స్థలం లేకపోవడంతో రోడ్డు పక్కన నిద్రిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ రోడ్డు మార్గంలో ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కూలీలు పడుకోవద్దని హైవే పెట్రోలింగ్ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు ఈ హెచ్చరిక చేసిన తర్వాతి రోజే ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూలీలను తీసుకొచ్చి.. సరైన వసతులు కల్పించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)