భారత్ నుంచి 500 మిలియన్ డాలర్ల అప్పు !

Telugu Lo Computer
0


తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దేశం భారత్ నుంచి పెద్ద మొత్తంలో రుణం ఆశిస్తోంది. ఎక్సిమ్ బ్యాంకు ఇండియా నుంచి 500 మిలియన్ డాలర్ల అప్పు కోరుతూ చేసిన ప్రతిపాదనకు శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రుణం ద్వారా పొందిన డబ్బుతో ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దేశంలో తలెత్తిన ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంకలో ఊహించని విధంగా ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు దారి పొడవునా బారులు తీరున దృశ్యాలు ఇటీవల కనిపించాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులకు డబ్బు చెల్లించే స్థితిలో కూడా ప్రస్తుతం శ్రీలంక లేదు. అంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అందువల్ల ఇంధనాన్ని దిగుమతి చేసుకుని డబ్బు చెల్లించే పరిస్థితి కూడా లేకపోవడంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి రావడంతో ఇక అప్పోసొప్పో చేసైనా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. దిగుమతి చేసుకునేందుకు కొనుగోలు శక్తి లేకపోవడంతో నిత్యావసరాలకు కూడా శ్రీలంకలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశమైన శ్రీలంక ప్రభుత్వ మంత్రివర్గం ఎక్సిమ్ బ్యాంకు ఇండియా నుంచి రుణం కోరాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ ఇంధన వనరుల శాఖ మంత్రి కాంచన విజెశేఖర తెలిపారు. ఇప్పటికే శ్రీలంక ఎక్సిమ్ బ్యాంకు ఇండియా నుంచి 500 మిలియన్ డాలర్లు, స్టేట్ బ్యాంకు ఇండియా నుంచి 200 మిలియన్ డాలర్లు ఇంధన కొనుగోలు నిమిత్తం పొందినట్లు విజేశేఖర తెలిపారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల్లో శ్రీలంకకు జూన్ నుంచి 530 యూఎస్ డాలర్ల ఇంధన దిగుమతికి అవసరం అవుతాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో పెట్రోల్ ధర 24.3 శాతం, డీజిల్ ధర 38.4 శాతం పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)