మిర్చి, పత్తికి రికార్డు ధర!

Telugu Lo Computer
0


దేశీయ మిర్చి రకం బంగారంతో సమానంగా పోటీ పడుతుంది. ఏటా క్వింటా దేశీయ మిర్చి రూ. 25 వేల నుంచి రూ. 28 వేలకు పలుకుతుంది. ఈ సారి ఆరంభం నుంచి దేశీయ మిర్చి రకం ధర పెరుగుతూ వస్తుంది. గత నెల 3వ తేదీన తొలిసారి క్వింటాల్ దేశీయ మిర్చి ధర రూ. 32వేలు పలుకగా.. అప్పటి నుంచి పెరుగుకుంటూ వస్తోంది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్‌లో కిషన్ రావు అనే రైతు తెచ్చిన దేశీయ మిర్చి రికార్డు స్థాయిలో రూ. 55,551 పలికింది. మిర్చికి అధిక ధర నమోదు కావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెల్ల బంగారంగా పిలుచుకొనే పత్తి ధరలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. గతేడాది పత్తి క్వింటా రూ. 7, 500 వరకు పలికింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 8వేల పలికింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం పత్తి క్వింటా రూ. 12,110 చేరింది. పత్తికి, మిర్చికి గతంలో ఇలాంటి ధరలు ఎప్పుడూ చూడలేదని మార్కెట్ వ్యాపారులు, రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మిర్చి, పత్తి పంటల దిగుబడులు తక్కువగా ఉండటంతో ధరలు అమాంతం పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. మిర్చికి తెగుళ్లు సోకి పంట దెబ్బతినగా, వర్షాల వల్ల పత్తి పంట దెబ్బతింది. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవటంతో మిర్చి, పత్తికి రికార్డు ధరలు పలుకుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)