మహేశ్వరంలో సంతూర్ సబ్బుల యూనిట్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో విప్రో సంస్థ యూనిట్‌ను విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీతో కలిసి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరంలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో సంతూర్ సబ్బులతో పాటు సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్‌లను విప్రో ఉత్పత్తి చేయనుంది. ఈ యూనిట్‌కు నిమిషానికి ఏకంగా 700 సంతూర్ సబ్బులను తయారు చేసే సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలో ఇంత వేగంగా సబ్బుల ఉత్పత్తిని చేపట్టనుండటం ఇదే తొలిసారని కూడా ఆ కంపెనీ ప్రకటించింది. రూ.300 కోట్లతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి లభించనుందని, అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడానికి విప్రో కంపెనీ అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా గత రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో రూ. 2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఎవరి సాయం లేకుండా తమ ప్రభుత్వమే కష్టపడి ప్రైవేట్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తోందన్నారు. ఒక ఫ్యాక్టరీని రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అన్నారు. 'అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా అదృష్టం. విప్రో సంస్థ రూ.300 కోట్లతో మహేశ్వరంలో ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభిస్తోంది. అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం అభినందనీయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సరళీకృత విధానాలతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. సుమారు 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించాం. ఒక కంపెనీ రావాలంటే చాలా కష్టం ఉంటుంది. పక్క రాష్ట్రాలకు పోకుండా తెలంగాణకు వచ్చేలా కృషి చేస్తున్నాం' అని కేటీఆర్ అన్నారు విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. కంపెనీలకు పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్వాగతం చెబుతోందని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. అప్పుడు కూడా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని వెల్లడించారు. కంపెనీలు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రం అని అజీమ్ ప్రేమ్ జీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందన్నారు. కంపెనీలు రావడం వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)