యూనివర్సటీ వీసీలను నియమించుకునే పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాలి

Telugu Lo Computer
0


ఉపకులపతులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే కల్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే ఈ సమయంలో బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. విశ్వ విద్యాలయాల ఉపకులపతుల నియామకంలో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రానికి సంక్రమించిన హక్కులను కాలరాస్తున్నారన్నది అధికార డీఎంకే పక్ష ఆరోపణ. మరోవైపు అన్ని విశ్వ విద్యాలయాల వీసీలతో గవర్నర్ రవి ఊటి వేదికగా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం రోజునే ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం గమనించదగ్గ పరిణామం. విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం పడుతోందని స్టాలిన్ పేర్కొన్నారు. కొంత కాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సంప్రదింపులతో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపిక జరుగుతోందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం గుజరాత్‌లో కూడా గవర్నర్ వీసీలను నియమించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా కొత్త ట్రెండ్ వచ్చిందని, ఉపకులపతుల నియామకాలు తమ హక్కులుగా గవర్నర్ భావిస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఇలా చేయడం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడమే అవుతుందని స్టాలిన్ దుయ్యబట్టారు.గవర్నర్ ఇలా వ్యవహరించడం వల్ల అధికార యంత్రాంగంలో తీవ్ర గందరగోళం నెలకొందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)