హైదరాబాద్ లో బార్ షాప్స్ టైమింగ్స్ పొడిగింపు

Telugu Lo Computer
0


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్ షాప్స్ అర్ధరాత్రి 12 గంటల వరకు బార్స్ నిర్వహించుకునేలా అనుమతులిస్తూ తెలంగాణ ప్రభుత్వం  తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, వీకెండ్స్‌లో ఏకంగా ఒంటి గంట వరకు బార్లు తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది. ఇక స్టార్ హోటళ్లు, ఎయిర్‌పోర్ట్ హోటళ్లు లైసెన్స్ ఫీజుపై 25 శాతం అదనపు రుసుం చెల్లించి 24 గంటల పాటు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ ఖజానాకు మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరుతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెలా రాష్ట్రంలో రూ.2500 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గత మార్చి నెలలో రూ.2814 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, ఇందులో నెలాఖరు రోజునే రూ.307 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ తర్వాత మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేస్తారా... లేక మున్ముందు తెలంగాణవ్యాప్తంగా అన్ని బార్ షాప్స్‌కు దీన్ని వర్తింపజేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ఓవైపు డ్రగ్స్ కేసుపై రాష్ట్రవ్యాప్తంగా హాట్ హాట్‌గా చర్చ జరుగుతుంటే ప్రభుత్వం బార్ షాప్ పని వేళలను పొడిగించడం చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)