ఏడాదిలో ఒక్కరోజే తెరిచి ఉండే ఆలయం !

Telugu Lo Computer
0


హిందూ ధర్మంలో సర్పాలను దేవుళ్లుగా ఆరాధించే సంస్కృతి ఉంది. దేవతలు కూడా సర్పాలను ఆభరణాలుగా చేసుకుని కనిపిస్తారు. అయితే దేశంలో ఎన్నో నాగదేవాలయాలున్నాయి. అందులో ప్రమఖమైనది, ఇతర దేవాలయాలకన్నా ప్రత్యేకమైనది ఉజ్జయినిలో నాగచంద్రేశ్వరాలయం. ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం కొలువై ఉంది. ఇది ఏడాదికి ఒక్కరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. సర్పరాజుగా భావించే తక్షకుడు ఆ రోజు ఆలయంలోనే ఉంటాడని చెబుతారు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11 వ శతాబ్దానికి చెందిన ఓ ప్రతిమ ఉంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని శివపార్వతులు కూర్చుని ఉంటారు. ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. ఎందుకంటే సాధారణంగా సర్పంపై విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండడం విశేషం. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట. ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ 1732 లో ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయట. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)