పంజాబ్ లో ఎమ్మెల్యేల పెన్షన్‌కు కోత!

Telugu Lo Computer
0


పంజాబ్ లో మాజీ ఎమ్మెల్యేలకు ఇక నుంచి కేవలం ఒక్క టర్మ్‌కు మాత్రమే పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు గెలిస్తే, అన్ని సార్లు పెన్షన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి నెలకు 75వేల పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ అదే వ్యక్తి మరోసారి గెలిస్తే పెన్షన్ అమౌంట్‌లో 66 శాతం అదనంగా ఇస్తారు. అలా ఎన్ని సార్లు గెలిస్తే.. అన్ని సార్లు అమౌంట్ కలుపుతూ ఉంటారు. ప్రస్తుతం పంజాబ్‌లో 250 మంది ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నారు. కూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసిన సీఎం భగవంత్ మాన్‌ పంజాబ్‌లో ఒక్క సారి గెలిచిన ఎమ్మెల్యే అయినా లేదా రెండు, మూడు, నాలుగు, అయిదుసార్లు గెలిచిన ఎమ్మెల్యేకు ఒకే ఒక్క టర్మ్ కోసం పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పెన్షన్ స్కీమ్‌లో కోత విధించడం ద్వారా వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమం కోసం వాడనున్నట్లు ఆయన తెలిపారు. చాలా మంది ఎమ్మెల్యేలు లక్షల్లో పెన్షన్ తీసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. కొందరికి 3.50 లక్షలు, కొందరికి 4.50 లక్షలు, కొందరికి 5.25 లక్షల పెన్షన్ వస్తోందని, ఇది రాష్ట్ర ఖజానాకు భారం అవుతోందని భగవంత్ మాన్ అన్నారు. ఫ్యామిలీ పెన్షన్‌లోనూ తగ్గింపు ఉంటుందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తన పెన్షన్‌ను సామాజిక కార్యక్రమాలకు వాడుకోవాలని  11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ సింగ్ బాదల్ ఇటీవల  ప్రభుత్వాన్ని కోరారు. బాలికల విద్య కోసం వాడుకోవాలన్నారు. ఒకవేళ పెన్షన్ కావాలనుకుంటే, ప్రకాశ్ సింగ్ బాదల్‌కు సుమారు 5 లక్షల పెన్షన్ వచ్చేది. భగవంత్ మాన్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌, అకాలీదళ్ నేతలు ఆహ్వానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)