పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి !

Telugu Lo Computer
0


ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్దెట్ సమావేశాల సందర్భంగా తొలిసారిగా ప్రత్యక్షంగా ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా ప్రత్యక్షంగా ప్రసంగించారు. గతంలో అంటే 2020, 2021లలో కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్‌లో మాత్రమే ప్రసంగం సాగింది. ఈసారి ప్రత్యక్షంగా ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అని గవర్నర్ అభివర్ణించారు. 2023 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేలా పనులు జరుగుతున్నాయన్నారు. మరోవైపు భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రాష్ట్రంలో రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని దేశంలోనే తొలిసారిగా మైక్రోసాప్ట్ అప్‌స్కిల్లింగ్ కార్యక్రమం నడుస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని చెప్పారు. ఉగాది నుంచి రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో పరిపాలన కొనసాగుతుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని ప్రశంసించారు. పరిపాలను క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగులను ప్రభుత్వానికి మూలస్థంభాలుగా భావిస్తున్నామన్నారు. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్ని ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి చేస్తున్నామని..ఇప్పటికే 17 వేల 715 పాఠశాలల్ని అభివృద్ధి చేశామని చెప్పారు. అమ్మఒడి పధకం కింద తల్లుల ఖాతాల్లో 13 వేల 23 కోట్లు జమ చేశామన్నారు. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62కు పెంచామని గుర్తు చేశారు. అటు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతులు 13 వేల 5 వందల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలను వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలలు ప్రతిపాదించామని..శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటైందన్నారు. ఓ వైపు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే..టీడీపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రతుల్ని చింపి గవర్నర్ పైనే విసిరేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)