సిగరెట్ తాగేందుకు బయటకు పిలిచి హత్య !

Telugu Lo Computer
0


తిరుపతి నగరం మల్లంగుంట చెందిన మహబూబ్ బాషా, దామోదర్, షేర్ల వెంకటేష్, సంజీతం బాలాజీలు స్నేహితులు. చిన్నతనం నుంచి స్నేహితులుగా ఉన్న వీరు పెరిగి పెద్దయ్యాక కూడా అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా స్నేహితులు అందరూ కలసి వెళ్లి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గానీ తిరిగి వచ్చే వారు కాదు. అయితే మహబూబ్ బాషా ఓ ప్రముఖ పార్టీలో నాయకుడిగా వ్యవహరిస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. తనతో పాటు తన ముగ్గురు స్నేహితులు మహబూబ్ భాషాకు తమ చేతనైన సాయం చేస్తూ వస్తున్నారు. అవసరాల నిమిత్తం మహబూబ్ బాషా తనకు అత్యంత సన్నిహితులైన సంజీతం బాలాజీ, షేర్ల వెంకటేష్, దామోదర్ల వద్ద కొంత మొత్తంలో అప్పు తీసుకున్నారు. ఎంతకీ నగదు తిరిగి ఇవ్వక పోవడంతో ముగ్గురు స్నేహితులు మహబూబ్ బాషాపై ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఆ నలుగురు స్నేహితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. తీసుకున్న నగదును తిరిగి ఇవ్వక పోవడమే కాకుండా మహబూబ్ బాషా వారిపై రౌడీయిజం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో బాషాపై కక్ష పెంచుకున్న ఆ ముగ్గురు స్నేహితులు ఎలాగైనా మహబూబ్ బాషా నుంచి నగదును తిరిగి తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ నగదు చేతికి తిరిగి రాకపోవడంతో మహబూబ్ బాషాను అంతం చేసేందుకు ఆ ముగ్గురు స్నేహితులు ప్లాన్ చేశారు. తాము వేసుకున్న ప్లాన్ ప్రకారం మహబూబ్ భాషాను హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు విఫలం చెందడంతో మరోమారు వారి ప్రయత్నాన్ని కొనసాగించే పక్కాగా స్కెచ్ వెశారు. జనవరి 29న ఉదయం ముగ్గురు స్నేహితులు మహబూబ్ బాషా కు ఫోన్ చేసి సిగరెట్ త్రాగేందుకు పిలిచారు. తనకు పని ఉందని ఇప్పుడు వీలు కాదని మహబూబ్ బాషా నిరాకరించారు. కానీ ఎలాగైనా రావాలని ఆ ముగ్గురు బలవంతం చేయడంతో స్నేహితులతో కలిసి సిగరెట్ తాగేందుకు తిరుపతి శివారు ప్రాంతానికి వెళ్లారు. జన సంచారం లేని ప్రాంతానికి ఆ ముగ్గురు స్నేహితులు మహబూబ్ బాషాను తీసుకెళ్ళారు. కొంతసేపు నవ్వుతూ మట్లాడిన ఆ ముగ్గురు తరువాత తాము ఇచ్చిన నగదును తమకు తిరిగి ఇవ్వాలని స్నేహితుడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో స్నేహితులకు, మహబూబ్ బాషాకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మహబూబ్ బాషాపై ఆగ్రహించిన ఆ ముగ్గురు స్నేహితులు వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. మహబూబ్ బాషా మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. రోడ్డుకు పక్కన పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే బుధవారం నాడు మల్లంగుంట జంక్షన్ వద్ద ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసు వాహనం చూసి ద్విచక్ర వాహనంలో పరార్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మహబూబ్ బాషాను హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందుతుల వద్ద నుండి రెండు కత్తులు, మూడు మొబైల్స్, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దామోదర్, షేర్ల వెంకటేష్, సంజీతం బాలాజీలలను తిరుపతి పోలీసులు రిమాండుకు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)