మల్లన్న సాగర్ జాతికి అంకితం

Telugu Lo Computer
0

 


తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ మల్లన్న సాగర్ ను జాతికి అంకితం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ లో  నిర్మించిన పుంపుహౌజ్‌ వద్ద మోటార్లను ఆన్ చేస్తారు. అనంతరం జలాశయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసితుల వివాదం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్త్ నిర్వహిస్తున్నారు. సుమారు 1500 మంది పోలీసులతో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ మల్లన్న సాగరే అతి పెద్దది..ఇందు కోసం 6 వేల కోట్ల వ్యయంతో 50 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో సిద్దిపేట జిల్లా తొగుట కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య జలాశయం ను నిర్మించారు . అత్యంత ఎత్తున నిర్మించిన జలాశయంగా మల్లన్నసాగర్ ప్రత్యేకతను సంతరించుకుంది. డ్యామ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మల్లన్నసాగర్‌ ను ప్రారంభానికి అధికారులు సర్వ సన్నద్ధం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం తో వ్యవసాయ అవసరాలతోపాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు దీని నుంచి నీటిని అందిస్తారు. మరో 7.37 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ-స్టేజ్‌ 1, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15,71,050 ఎకరాలు ఈ రిజర్వాయర్‌ కిందికి రానున్నాయి. రిజర్వాయర్‌ వైశాల్యం 17,600 ఎకరాలు కాగా, 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున ఐదు అంచెల్లో దీన్ని కట్టారు. 143 మీటర్ల పొడవుతో మత్తడిని ఏర్పాటుచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)