డాక్టర్ ని చంపుతామని బెదిరించి రూ.70 లక్షల డిమాండ్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోని గుంటూరువారి తోట ఒకటో లేనులోని బృందావన్‌ అపార్ట్‌మెంటులో డాక్టర్‌ ముప్పవరపు నాగేంద్ర ప్రసాద్‌  సత్య హాస్పటల్‌ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద గతంలో పని చేసిన నల్లిబోయిన గణేష్‌ తన స్నేహితులు దాసరి దేవీప్రసాద్‌, అన్నమనేడి మధుసూదనరావు, షేక్‌ అక్బర్‌ బాషాలతో కలిసి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని పథకం రూపొందించాడు. వీరంతా డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ను చంపుతామని బెదిరిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని భావించారు. ముందస్తుగా వేసుకున్న పథకంలో భాగంగా గతనెల 31న దేవీ ప్రసాద్‌, మధుసూదనరావులు వైద్యుడి ఇంటి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నాడని గుర్తించి అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈనెల 1న దేవీ ప్రసాద్‌, మధుసూదనరావులు తమ స్నేహితుడి సెల్‌ఫోన్‌ తీసుకొని వైద్యుడికి ఫోన్‌ చేశారు. 'మిమ్మల్ని చంపడానికి కొందరు మాకు రూ.70 లక్షలు సుఫారి ఇచ్చారు. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు మా వద్ద ఉన్నాయి. ఆ రూ.70 లక్షలు మీరే మాకు ఇస్తే మిమ్మల్ని చంపకుండా వదిలేస్తాం'.. అని వైద్యుడిని బెదిరించారు. ఈనెల 2న డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కొత్తపేట పోలీసులు యువకులు ఉపయోగించిన సెల్‌ఫోన్ల డేటా ఆధారంగా నిందితుల వివరాలు సేకరించారు. ఆదివారం నల్లచెరువు వాటర్‌ ట్యాంకుల వద్ద తిరుగుతున్న గణేష్‌, దేవీ ప్రసాద్‌, మధుసూదనరావు, అక్బర్‌ బాషాలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. సమావేశంలో లాలాపేట సీఐ ప్రభాకర్‌, కొత్తపేట ఎస్‌ఐ మధుపవన్‌ పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)