ఒమిక్రాన్‌ భయం అరబ్ ఎమిరేట్స్ కు ఎందుకులేదు ?

Telugu Lo Computer
0


డెల్టా వేరియంట్ దెబ్బ నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని ఒమిక్రాన్ రూపంలో మరో కరోనా వైరస్ వేరియంట్ భయపెడుతోంది. యూరప్‌లోని అనేక దేశాలలో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు పెట్టక తప్పని పరిస్థితిని కల్పిస్తోంది ఒమిక్రాన్. కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం దాని ప్రభావం నుంచి పూర్తి దూరంగా ఉండగలిగింది. వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని దేశాలు పర్యాటకులు రావద్దంటూ తలుపులు మూసేస్తుంటే, యూఏఈ మాత్రం టూరిస్టులను రారమ్మని పిలుస్తోంది. వేగంగా వ్యాక్సినేషన్, ఉత్తమమైన టెస్టింగ్‌ విధానాలతో కరోనా వైరస్‌పై ఇతర దేశాలకంటే మెరుగ్గా పోరాడుతోంది యూఏఈ. బ్లూమ్‌బెర్గ్ కరోనా రెసిలియెన్స్ ర్యాంకింగ్‌లో యూఏఈ అగ్రదేశాల సరసన నిల్చుంది. 53 దేశాలలో నిర్వహించిన ఈ సర్వేలో, ఆరోగ్య సౌకర్యాలు, ప్రమాణాలు, ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణాలు, ట్రావెల్ రీఓపెనింగ్ లాంటి 12 అంశాలను పరిశీలించారు. అందుకే ఐరోపాలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ, యూఏఈ వ్యాధి సంక్రమణను నియంత్రించగలుగుతోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధిక జనాభా ఉన్న నగరం దుబాయి కరోనా మహమ్మారి నుంచి సురక్షితమైన ప్రాంతంగా మారింది. ''మేమంతా ఒకరినొకరు రక్షించుకోవడానికి కలిసి పని చేశాం. ప్రభుత్వ విధానాలకు స్థానిక ప్రజల నుంచి మద్ధతు లభిస్తోంది. రెండేళ్ల కిందటితో పోలిస్తే దుబాయ్ నగరం చాలా మారిపోయింది. మరో గ్రహం మీద అడుగు పెట్టినట్లుంది'' అని కేథీ జాన్‌స్టన్‌ అన్నారు. ఆమె మిర్జామ్ చాక్లెట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ సమయంలో యూఏఈలో వాతావరణం బాగుంటుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ''అక్టోబరు నుండి మే వరకు దుబాయ్ సందర్శించడానికి మంచి సమయం. సముద్ర తీరంలో హాయిగా ఉంటుంది'' అని దుబాయ్ నివాసి తాలా మహమ్మద్ చెప్పారు. అందుకే ఈ సీజన్‌లో ఓపెన్ ఎయిర్ ఈవెంట్‌లు, సాయంత్రం పూట సందళ్లు జోరుగా సాగుతుంటాయి. గల్ఫ్ తీరంలోని దాదాపు ప్రతి నగరంలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఆరు నెలల పాటు జరిగే 'ఎక్స్‌పో 2020'ని కూడా దుబాయ్ నగరమే నిర్వహిస్తోంది. ఇది మార్చి 2022 వరకు కొనసాగుతుంది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న కంపెనీలు తమ ప్రత్యేకమైన, విభిన్నమైన ఉత్పత్తులను, వాటి భవిష్యత్ ప్రణాళికలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)