అవమాన భారంతో ఆత్మహత్య

Telugu Lo Computer
0


కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని యదేహళ్లి ప్రాంతానికి చెందిన వీణా (32) అనే వివాహితకు ఇద్దరు కుమార్తెలు. ఒక పాపకు ఏడేళ్లు, మరో పాపకు ఏడాది వయసు. సంక్రాంతికి సొంతూరు వెళుతున్నానని భర్తకు చెప్పి జనవరి 13న పిల్లలను తీసుకుని వెళ్లింది. ఆమె మృతదేహం జనవరి 14న హొన్నళి తాలూకాలోని యక్కనహళ్లిలో లభ్యమైంది. ఏడేళ్ల పాప మృతదేహం కూడా మరోచోట కనిపించింది. ఏడాదిన్నర పాప మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె భర్త ఫిర్యాదుతో హొలేహోన్నురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హొలేహోన్నురు సమీపంలోని అరహతొళలు గ్రామానికి చెందిన సంతోష్, అతని భార్య ఆషా తన భార్యాపిల్లల ఆత్మహత్యకు కారణమని వీణ భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీణకు తెలిసిన వాళ్లు కావడంతో.. ఆ భార్యాభర్తలకు 8 లక్షల రూపాయలు అప్పుగా తన భార్య ఇచ్చిందని ఆమె భర్త చెప్పాడు. ఆ డబ్బును తిరిగివ్వమని వీణ అడగ్గా ఇచ్చేందుకు నిరాకరించిన సంతోష్, ఆషా తన భార్య వీణ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తప్పుడు ప్రచారం చేశారని తెలిపాడు. ఈ పుకార్ల కారణంగా తన భార్య నిజంగానే వివాహేతర సంబంధం పెట్టుకుందని కొందరు భావించారని, ఈ పరిణామం తన భార్యను మానసికంగా కుంగదీసిందని.. తనతో చెప్పుకుని తీవ్ర మనస్తాపం చెంది బాధపడేదని ఆమె భర్త చెప్పాడు. పుకార్లను పట్టించుకోవద్దని తాను ధైర్యం చెప్పినప్పటికీ ఆ పరిణామం తన భార్యను మానసికంగా కుంగదీసిందని వీణ భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. పండుగకు అమ్మ వాళ్లింటికి వెళ్లొస్తానని భార్య చెబితే అక్కడికి వెళితేనైనా ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుందని భావించానని, కానీ ఇంతలోనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేదని వీణ భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా, ఆమె ఆత్మహత్యకు, అభంశుభం తెలియని ఇద్దరు పిల్లల చావుకు కారణమైన సంతోష్‌ను, ఆషాను కఠినంగా శిక్షించాలని వీణ భర్త డిమాండ్ చేశాడు. పుట్టింటికి వెళతానని భర్తకు చెప్పి వెళ్లిన వీణ ఇద్దరు పిల్లలను తీసుకుని హంచిన సిద్ధాపుర సమీపంలోని భద్రా కెనాల్ వద్దకు వెళ్లింది. భద్రా కాలువలో పిల్లలిద్దరినీ తోసి, ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం నీళ్లలో కొట్టుకుని వచ్చి యక్కనహళ్లి సమీపంలో తేలగా, ఏడేళ్ల పాప మృతదేహం చెన్నగిరి తాలూకాలోని నల్లూర్ సమీపంలో వెలుగుచూసింది. మరో పాప మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలా తల్లి, ఇద్దరు పిల్లల జీవితం విషాదాంతమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జనవరి 15న సంతోష్‌ (35)ను అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)