పేగులలో శబ్దాలు ఎందుకు వస్తాయి ?

Telugu Lo Computer
0


మన జీర్ణవ్యవస్థలో జీర్ణాశయం, పేగులు చాలా ముఖ్యమైన భాగాలు. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అయ్యాక చిన్న పేగులకు చేరుతుంది. అక్కడ ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకుంటుంది. తరువాత మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగు ద్వారా బయటకు వస్తాయి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగే ప్రక్రియ. కొన్ని సార్లు మనకు పేగుల్లో శబ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో అసౌకర్యానికి గురవుతుంటాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? ఆ శబ్దాలు ఎందుకు వస్తాయి ? దీంతో మనకు ఏదైనా హాని కలుగుతుందా ? అంటే పేగుల్లో ఆహారం కదలికల వల్ల కొన్ని సార్లు గ్యాస్ ఏర్పడి అది శబ్దాలుగా మారుతుంది. అయితే ఒక మోస్తరు స్థాయిలో శబ్దాలు వస్తే ఖంగారు పడాల్సిన పనిలేదు. అది సాధారణమే. దాంతో ఎలాంటి హాని కలగదు. కానీ అసలు శబ్దాలు రాకపోతే అలాంటి వారు మలబద్దకంతో బాధపడుతున్నట్లు అర్థం. లేదా ఇతర జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాంటి వారికి పేగుల నుంచి శబ్దాలు రావు. ఇక పేగుల నుంచి శబ్దాలు మరీ ఎక్కువగా వస్తుంటే.. గ్యాస్ లేదా విరేచనాల సమస్య ఉందని తెలుసుకోవాలి. లేదా వికారం, వాంతులు అయ్యే వారికి, అవబోతున్న వారికి ఇలా పేగుల నుంచి ఎక్కువగా శబ్దాలు వస్తుంటాయి. కనుక శబ్దాల తీవ్రతను బట్టి మనకు కలిగే అనారోగ్య సమస్యలను ముందుగానే అంచనా వేయవచ్చు. శబ్దాలు అసలు రాకపోయినా లేదా మరీ ఎక్కువగా వస్తున్నా.. డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో జీర్ణవ్యవస్థను పరీక్షించి చికిత్స చేస్తారు. శబ్దాలు ఒక మోస్తరుగా వస్తుంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ జీర్ణవ్యవస్థ సరిగ్గానే పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)