చిన్నారుల్లో పెరుగుతున్న కరోనా మహమ్మారి

Telugu Lo Computer
0


దక్షిణాప్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. ఈ సమయంలో చిన్నారుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరగడంపై దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి వల్ల పిల్లలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఎదురుకాలేదు. అవన్నీ మనం చూశాం. మూడో వేవ్‌లో మాత్రం ఐదేళ్ల లోపు పిల్లలు, 15 నుంచి 19 సంవత్సరాల లోపువారిలో ఆసుపత్రిలో చేరిక ఎక్కుగానే కనిపించింది. ప్రస్తుతం మేం నాలుగో వేవ్ ప్రారంభంలో ఉన్నాం. అన్ని వయస్సుల వారితో పాటు మరీ ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్న సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముందుగా ఊహించినట్లుగానే ఆ రేటు తక్కువగానే ఉన్నప్పటికీ 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల తర్వాత ఐదేళ్ల లోపు వారిలోనే ఈ చేరిక అధికంగా ఉంది. ఈ తీరు గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది' అని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌ఐసీడీ)కి చెందిన వైద్యులు వాసిలా జస్సాత్ వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి మరింత పరిశోధన అవసరమని ఎన్‌ఐసీడీకి చెందిన మరో వైద్యాధికారి మిషెల్ గ్రూమ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'ఇప్పుడు మేం నాలుగో వేవ్ ప్రారంభ దశలో ఉన్నాం. చిన్న పిల్లల్లో ఈ ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది. మరికొన్ని వారాలు ఈ వయస్సు వారిని పర్యవేక్షించడం ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. వైద్య సేవల విషయంలో ముందస్తు సంసిద్ధత కోసం మేం ఈ విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది' అని మిషెల్ వెల్లడించారు. చిన్నారులు, గర్భిణీల్లో ఇన్ఫెక్షన్‌ రేటు పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఆ దేశ వైద్యశాఖ పేర్కొంది. 'ప్రస్తుతం కొత్త వేరియంట్ ప్రారంభ దశలో ఉన్నాం. సమాచారం కూడా పరిమితంగానే ఉంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్న సంకేతాలున్నాయి. అయితే లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టీకా తీసుకున్నవారిలో' అని ఆ దేశ ఆరోగ్య మంత్రి జో పాహ్లా మీడియాకు తెలిపారు. ఆ దేశంలోని తొమ్మిది ప్రావిన్సుల్లో ఏడింటిలో ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు పెరుగుతోందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)