చైనా నుంచి నికరాగువా కు పది లక్షల టీకాలు..!

Telugu Lo Computer
0


నికరాగువా ఇటీవల తైవాన్‌తో సంబంధాలు తెంచుకుని చైనాతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. అందుకు ప్రతిఫలం తాజాగా నికరాగువాకు చైనా నుంచి ఆ దేశానికి 10 లక్షల కరోనా టీకా డోసులు వెళ్లాయి. ఈ క్రమంలో 2లక్షల డోసులతో అక్కడ ల్యాండ్‌ అయిన ఎయిర్‌ చైనా విమానం చిత్రాలను స్థానిక టీవీలలో ప్రసారం చేశారు. బీజింగ్‌తో సంబంధాలు పునరుద్ధరించు కోవడం చాలా గొప్ప విషయం అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీనిపై నికరాగువా అధ్యక్షుడి కుమారుడు లారెగో ఒర్టెగా మురిల్లో మాట్లాడుతూ ''నికరాగువా ప్రజలకు 10లక్షల డోసుల వ్యాక్సిన్లు వచ్చాయనే శుభవార్తతో తిరిగి వచ్చాం'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 38శాతం మందికే పూర్తిస్థాయిలో టీకాలు అందాయి. కనీసం 67శాతం మందికి ఒక డోసు టీకా వేశారు. గత వారం నికరాగువా తైవాన్‌ పక్షాన్ని వీడి చైనా పంచన చేరింది. దీనిపై తైవాన్‌ స్పందిస్తూ.. నికరాగువా కొన్నేళ్ల స్నేహాన్ని మరిచిపోయినందుకు విచారం వ్యక్తం చేసింది. ఆ దేశానికి తైవాన్‌కు మంచి వాణిజ్య భాగస్వామ్యం ఉంది. కానీ, గత వారం నుంచి తైవాన్‌ను చైనాలోని భాగంగా గుర్తిస్తున్నట్లు నికరాగువా అధ్యక్షుడు ప్రకటించారు. త్సాయి యింగ్‌ వెన్‌ 2016లో అధికారం చేపట్టే నాటికి 14 దేశాలు తైవాన్‌ను అధికారికంగా గుర్తించేవి. కానీ, ఇప్పుడు వాటి సంఖ్య 12కు పడిపోయింది. ఈ క్రమంలో ఐరోపా దేశమైన లిథువేనియా తైవాన్‌లో ప్రతినిధుల కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీంతో చైనా లిథువేనియా సంబంధాలు దెబ్బతిన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)