పేకేటి శివరామ్

Telugu Lo Computer
0


పేకేటి శివరామ్ అసలు పేరు పేకేటి శివరామ సుబ్బారావు.  ఈయన అక్టోబరు 8, 1918 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించారు.1937లో మద్రాస్ వెళ్లి కొంతకాలం కెమెరా డిపార్ట్‌మెంటులో, 1945లో హెచ్‌ఎంవి గ్రామ్‌ఫోన్ రికార్డు సంస్థలో ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డు చేశారు. శ్రమజీవి అనే పత్రికకు కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకుడిగా పనిచేశారు. చిత్ర అనే సినిమా పత్రిక భాద్యతలు నిర్వహించారు. బెంగళూరు నుండి వెలువడే సినిమా ఫ్లేమ్‌ అనే పత్రికకు మద్రాసు ప్రతినిధిగా పనిచేశారు. భగవాన్ పేరుతో పద్దెనిమిది డిటెక్టివ్ నవలలు వ్రాశారు. ప్రతిభా, వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో ‘శాంతి’ (1952) చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి, 1953లో దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు సాధించారు.అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందకు పైగా చిత్రాల్లో నటించారు. మద్రాసులో ఒకవిందులో మిత్రునితో సాగించిన సినీరంగం, నిర్మాణ కార్యక్రమాల విశ్లేషణ వీరిని కన్నడ చిత్ర రంగానికి దర్శకునిగా, ‘చక్రతీర్థ’ కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. తరువాత 1971 కన్నడంలో రూపొందించిన ‘కుల గౌరవం’ చిత్రం (రాజ్‌కుమార్, భారతి, జయంతిలతో), దాన్ని తెలుగులో యన్‌టిఆర్‌తో 1972లో నిర్మించిన కులగౌరవం చిత్రానికి ఇతడే దర్శకుడు కావటం విశేషం. శ్రీదేవి కంబైన్స్ 1968లో నిర్మించిన చుట్టరికాలు తరువాత, 1969లో అదే సంస్థ నిర్మించిన ‘భలే అబ్బాయిలు’కు దర్శకత్వం వహించారు. నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే. తమిళ నటుడు ప్రశాంత్ ఈయన  మనుమడు.

Post a Comment

0Comments

Post a Comment (0)