ఎవరు చెప్పొచ్చారు?

Telugu Lo Computer
0


నువ్వు పుట్టిన నీ దేశ సరిహద్దుల్లో నిలబడి కాపలా  కాయలేకపోవచ్చు, దేశం  మీద  నీకున్న  ప్రేమను చూపించుకోలేకపోవచ్చు. నిన్ను కన్న తల్లిదండ్రులకు నువ్వేమి చేస్తున్నావు, కనీసం పలకరిస్తున్నావా?  నీ కన్నబిడ్డల కోసం అహర్నిశలూ శ్రమిస్తూ ఇరవైనాలుగు గంటలూ ఆలోచించే నువ్వు నీ కన్నవాళ్లకు  ఆసరాగా  ఉన్నావా? , అవసరం  తీరాక అవతల  విసిరిపారేసావా?  ఎందుకు వృద్ధాశ్రమాలు   ఎక్కడపడితే  అక్కడ వెలుస్తున్నాయి. బంధాలలో ఆప్యాయత, అనురాగం  ఎందుకు ఆవిరైపోతున్నాయి. నువ్వు రోడ్డు మీద వదిలేసిన నీ తల్లిదండ్రులను చూసి అపరిచితులెందరో అయ్యో పాపం అంటారు. పరాయివాళ్లెవరో  పట్టెడన్నం  పెడతారు.  నువ్వు ఇంట్లో కూచుని పంచభక్ష్యపరమాన్నాలు ఎలా తింటున్నావు? అయినవాళ్లంతా  అనాధలుగా  వదిలేస్తే కానివాళ్లెవరో  అక్కున  చేర్చుకుంటారు, ఆదరణ చూపిస్తారు.  తల్లిదండ్రులెవరూ కన్నబిడ్డలను శాపనార్ధాలు  పెట్టరు, అలా అని పాపం చేస్తావా?  ఏం బాపుకుంటావు?  నువ్వు పుట్టినపుడు నీ పనులన్నీ  వాళ్ళు ప్రేమతో చేస్తారు కదా!  వృద్ధాప్యం అంటే రెండో బాల్యం, వాళ్ళ ఋణం తిరిగి తీర్చుకునే  ఒక అద్భుత అవకాశం. నువ్వు వచ్చిరాని మాటలతో ముద్దుముద్దుగా  పిలిచినప్పుడు  పులకరించిపోయిన  నీ తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో నీ పలకరింపు కోసం పలవరించే వాళ్ళను, మాటలన్నీ  నేర్చిన  నువ్వు ఎలా మర్చిపోగలవు? నీ చిన్నపుడు అమ్మా, నాన్నా అంటూ ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చి వాటేసుకున్న  నువ్వు, వాళ్ళు నిన్ను పిలుస్తున్నా వినిపించుకోకుండా విసుక్కుని  ఎలా వెళ్ళిపోతావు? నిన్ను కన్న తల్లిదండ్రులను కనీసం పట్టించుకోని నువ్వు పిల్లలను ఎందుకు కంటావు? వాళ్ళు నిన్ను ఉద్ధరిస్తారనే  అనుకుంటావా? నీ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు  పంపినట్లు  నీ పిల్లలను అనాధాశ్రమాలకు  పంపగలవా?  ఎందుకైనా మంచిది నీ తల్లిదండ్రులను ఏ వృద్ధాశ్రమానికి  పంపావో  అందులో నీకో గది అడ్వాన్స్ బుకింగ్  చేసుకో, ఎందుకంటే కొన్నాళ్ల తర్వాత నీకు ఉండడానికి ఏ ఆశ్రమం దొరకక  రోడ్డుపక్కన  పడిఉండాల్సివస్తుందేమో  ఎవరు చెప్పొచ్చారు?. 

Post a Comment

0Comments

Post a Comment (0)