ప్రజానుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం

Telugu Lo Computer
0


లిబరల్‌ డెమోక్రటిక్‌ కొమెయి సంకీర్ణ ప్రభుత్వానికి అంతం పలికి ప్రజానుకూల ప్రభుత్వాన్ని స్థాపిద్దామని జపాన్‌ కమ్యూనిస్టు పార్టీ చైర్మన్‌ షియి కజువో పిలుపిచ్చారు. టోక్యో జెఆర్‌ ఇకబుకురో స్టేషన్‌కు సమీపంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ ర్యాలీ వీడియోని దాదాపు 10వేల మంది ప్రేక్షకులు వీక్షించారు. అంతకుముందు ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రతినిధుల సభను రద్దు చేశారు. జపాన్‌ ఎన్నికలను ప్రకటించారు. దాంతో వెంటనే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. నయా ఉదారవాద విధానాలను ప్రజల జీవితాలకు, వారి జీవనోపాధులకు విలువ ఇచ్చేలా మార్చాలని జపాన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదిస్తోందని షియి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, లింగ సమానత్వ జపాన్‌ను సాకారం చేసేందుకు తమ పార్టీ చర్యలను ప్రతిపాదిస్తోందని అన్నారు. యుద్ధాన్ని నిషేధిస్తున్న జపాన్‌ రాజ్యాంగంలోని 9వ అధికరణను అత్యుత్తమంగా ఉపయోగించుకునే దౌత్యానికి శాంతి అనుకూల విధానాన్ని సాకారం చేయాలని ప్రతిపాదించింది. ఒక్క సీటు గల నియోజకవర్గాల్లో విజయం సాధించడం కోసం జెసిపి తీవ్రంగా శ్రమిస్తుందని షియి చెప్పారు. కానిస్టిట్యూషనల్‌ పార్టీ ఆఫ్‌ జపాన్‌తో కలిసి ఉమ్మడిగా తమ పార్టీ అభ్యర్ధులను నిలబెడుతుందని చెప్పారు. దీనికి తోడు, ప్రతిపక్షాలతో కూడిన ప్రజానుకూల ప్రభుత్వ స్థాపనకుగానూ జెసిపి చొరవ తీసుకుంటుందని అన్నారు. దామాషా ప్రాతినిధ్య బ్లాక్‌ల్లో జెసిపికి ఓటర్ల మద్దతును పెంచాలని కృత నిశ్చయంతో వున్నట్లు షియి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)