అయిన వాళ్లను చేరిన మంగమ్మ!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం నెలివేడి గ్రామానికి చెందిన నాగన్న తారకమ్మ కు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె పేరు మంగమ్మ. మంగమ్మ చిన్నతనంలో ఆమె తండ్రి ఓ శుభకార్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడే మూడు రోజులు ఉన్నారు. తల్లి తారకమ్మపై బెంగపెట్టుకున్న మంగమ్మ ఆ దిగులుతో తండ్రికి చెప్పకుండా బయటకు వచ్చేసింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో రోడ్లపై తిరుగుతున్న మంగమ్మను చూసిన ఓ యాచకుడు మీ అమ్మదగ్గరకు చేరుస్తానని చెప్పి విజయవాడ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తన మాట వినడం లేదని కొట్టడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆ పాపను ఎత్తుకొచ్చాడని తెలిసి మంగమ్మను రక్షించి అతడ్ని తరిమేశారు. పాపను బాధ్యతను గ్రామానికి చెందిన సామేలు అనే వ్యక్తి ముందుకొచ్చాడు. తనకున్న ఆరుగురు సంతానంతో కలిపి మంగమ్మను పెంచి పెద్దచేశాడు. దాలువూరుకి చెందిన దాసు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లికూడా చేశాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఐతే చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు, తమ్ముళ్లను తలుచుకుంటూ బాధపడుతుండేది. తన కష్టాన్ని అందరికీ చెప్పుకునేది. ఈ క్రమంలో పెద్దకుమార్తె శాంతకుమారిని యలవర్రు గ్రామానికి చెందిన కొండసీమ క్రిస్టోఫర్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఐతే అత్త మంగమ్మ గతం తెలుసుకున్న క్రిస్టోఫర్ ఆమెను ఎలాగైనా తనవారితో కలపాలని నిర్ణయించాడు. అనుకున్నదే తడవుగా అత్తగారు చెప్పిన వివరాలన్నీ తెలంగాణలోని తన మిత్రుడు భాస్కర్ కు చెప్పాడు. అతడి సాయంతో సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రుల వివరాలు సేకరించాడు. ఆమె తమ్ముళ్ల ఫోన్ నెంబర్లు సంపాదించాడు. వారికి ఫోన్ చేసి వివరాలు చెప్పడంతో అక్కకోసం ఆమె తమ్ముళ్లు వెంకటేష్, కృష్ణ పరుగులు పెట్టుకుంటూ యలవర్రు వచ్చారు. 38ఏళ్ల తర్వాత తన తమ్ముళ్లను చూసిన మంగమ్మ బోరున విలపించింది. తాను మరణించేలోపు తన తమ్ముళ్లను కలుస్తానో లేదోనని నిత్యం బాధపడే మంగమ్మకు తన అల్లుడు ఊహించని బహుమతి ఇవ్వడంతో ఆనందం పట్టలేకపోతోంది. తమ్ముళ్లకు అప్యాయంగా స్వీట్ తినిపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)