బలపడనున్న అల్పపీడనం

Telugu Lo Computer
0


తెలంగాణ వ్యాప్తంగా మరికొద్ది రోజులపాటు జోరువానలు కొనసాగనున్నాయి. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, పురపాలక అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు.. తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శనివారం రాష్ట్రంలో పిడుగుపాట్లకు ఐదుగురు మృతి చెందారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, హన్మకొండ జిల్లాలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పలుచోట్ల పిడుగులుపడి పశువులు మృతి చెందాయి. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 28గంటల్లో అల్పపీడనం ఏర్పడి, తర్వాత నాలుగైదు రోజుల్లో మరింత బలపడి.. దక్షిణ ఒడిశా-ఉత్తరకోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ, దక్షిణ తెలంగాణలో ఇప్పటికే వర్షాలు ప్రారంభం కాగా, మధ్య తెలంగాణ ప్రాంతంలో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆవర్తన ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం వల్ల కోస్తా ఆంధ్ర, సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ తెలంగాణ, ఉత్తర కర్ణాటక.. ఇంకా, దక్షిణ మహారాష్ట్రల మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)