స్పేస్ స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్లు రోజుకు ఎన్ని సూర్యోదయాలు చూస్తారో తెలుసా?

Telugu Lo Computer
0


భూమిపై ఉన్న మనం రోజుకు ఒక సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూస్తాం. మరి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ లోని ఆస్ట్రోనాట్లు ఇలా రోజుకు ఎన్ని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తారో తెలుసా? ఈ స్పేస్ స్టేషన్ భూమిని ఒకసారి చుట్టి రావడానికి 90 నిమిషాలు పడుతుంది. ఆ లెక్కన అందులోని ఆస్ట్రోనాట్లు ప్రతి 45 నిమిషాలకోసారి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూస్తారు. అంటే వీళ్లు ప్రతి రోజూ 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూడగలుగుతారు. స్పేస్ స్టేషన్ అధికారిక ట్విటర్‌లో ఈ మధ్యే ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతేకాదు ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. వీళ్లు చూసే ప్రతి సూర్యోదయం, సూర్యాస్తమయానికి ఉష్ణోగ్రతల్లో 250 డిగ్రీల ఫారన్‌హీట్ తేడా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులను ఆస్ట్రోనాట్లు ఎలా తట్టుకుంటారు? ఓ నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. వాళ్లు వేసుకునే స్పేస్ సూట్ ఈ అత్యధిక వేడి, అత్యధిక చల్లటి ఉష్ణోగ్రతల నుంచి ఆస్ట్రోనాట్లకు రక్షణనిస్తుందని చెప్పింది. ఆస్క్ నాసా సిరీస్‌లో భాగంగా ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించిన ప్రశ్నలకు స్పేస్ స్టేషన్ సమాధానమిచ్చింది. ఒకవేళ స్పేస్‌వాక్ చేసే ఆస్ట్రోనాట్లు స్పేస్‌స్టేషన్‌తో లింకు కోల్పోతే ఎలా అని ఒకరు.. తాను ఇప్పుడే ఆకాశంలో చాలా వేగంగా వెళ్తున్న మూడు చుక్కలు కనిపించాయని, అవి విమానాలైతే కావని, అవేంటో చెప్పాలని మరొకరు ప్రశ్నలు అడిగారు. అయితే చాలా మంది యూజర్లు ఆస్ట్రోనాట్లు ఇలా రోజుకు 16 సూర్యోదయాలను చూస్తారనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)