మరో విద్యుత్ షాక్

Telugu Lo Computer
0


వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ పెద్దలు, అధికారులు తమ పాలనలో... ప్రయివేటు సంస్థల దోపిడీ అరికట్టామని, పంపిణీ నష్టాలు తగ్గించామని గొప్పలు చెబుతూ...మళ్లీ తమ పాలనలోనే 2019-20, 2020-21 సంవత్సరాలకు లోటు వచ్చిందనే సాకుతో ట్రూ అప్‌ చార్జీల పోటుకు రంగం సిద్ధం చేయడం శోచనీయం. ఈ ప్రభుత్వం కూడా గత రెండు సంవత్సరాల కాలంలో కనపడకుండా కస్టమర్‌ చార్జీలు, స్లాబుల మార్పిడి ఇతర రూపాలలో విద్యుత్‌ భారాలు మోపింది. ఇది తాజా భారం.

     ఈ నెల వచ్చిన కరెంట్‌ బిల్లులతో ప్రజలు ఖంగుతిన్నారు. ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌పై అదనంగా ప్రతి యూనిట్‌కు రూ.1.23 పైసలు (శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు యూనిట్‌కు 45 పైసల చొప్పున) అదనంగా కలిపి బిల్లులు ఇస్తున్నారు. 2014 సంవత్సరం నుండి 2019 వరకు ఆనాడు వాడుకున్న కరెంటుకు అందరూ బిల్లులు చెల్లించేశారు. కానీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇప్పుడు లెక్క చూసుకుని వారికి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైందని తేల్చారు. దాన్ని ట్రూ అప్‌ ఛార్జీల పేరిట వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రూ.3699 కోట్ల భారం వేసింది

సర్దుబాటు పేరుతో చార్జీల పోటు

ఏదయినా వస్తువుకు, సర్వీసుకు డబ్బు చెల్లించి వినియోగించుకున్న తర్వాత కొద్ది సంవత్సరాలకు మళ్ళీ తేడా వచ్చిందని అధికంగా వసూలు చేసిన ఉదాహరణలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. కానీ విద్యుత్‌లో మాత్రం మన ప్రభుత్వాలు ట్రూ అప్‌, సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా ప్రజల నుండి గుంజుతున్నాయి. యూనిట్‌కు రూ.1.23 పైసల అదనపు భారం ఎనిమిది నెలలపాటు మార్చి నెల వరకు ప్రతి నెల చెల్లించాల్సిందే. రూ.1.45 పైసలు స్లాబ్‌ మొదలుకుని పది రూపాయలు వరకు చెల్లించే అందరూ రూ.1.23 పైసలు అదనంగా చెల్లించాలి. దీనివలన 50 యూనిట్ల లోపు వినియోగించే పేదలపై దాదాపు వంద శాతం భారం పడుతుంది. తక్కువ కరెంటు వాడే వారికి ఎక్కువ భారం పడుతుంది. వ్యాపార సంస్థలు, పరిశ్రమలు చెల్లించే అదనపు విద్యుత్‌ ఛార్జీలను వినియోగదారుల నుండి పరోక్షంగా ఆ సంస్థలు వసూలు చేస్తాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలు కరెంటు బిల్లులను మళ్ళీ జనం పైనే రుద్దుతాయి. ఇటీవల వచ్చిన విధానాల వలన మంచి నీరు, డ్రైనేజీ ఛార్జీలు నిర్వహణకు అయ్యే ఖర్చును లెక్కించి ప్రతి సంవత్సరం ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. ట్రూ అప్‌ చార్జీల భారం వలన మున్సిపాలిటీలలో మంచినీరు, డ్రైనేజి చార్జీలు పెరుగుతాయి. రాష్ట్రంలో సుమారు ఒక కోటి 50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబంమీద 8 నెలల్లో సగటున 2,500 రూపాయల వరకు భారం పడుతుంది. ఇదే కాకుండా 2019-20 సంవత్సరం జమా, ఖర్చులను లెక్క చూసి మళ్ళీ ఈ సర్దుబాటు చార్జీలు రూ.2542 కోట్లు చెల్లించాలని నియంత్రణ మండలి ముందు విచారణ జరుగుతోంది. ఏప్రిల్‌ నుండి ఆ భారం జనం నెత్తిన పడుతుంది. త్వరలో ప్రతి 3 నెలలకు ఈ సర్దుబాటు చార్జీల భారం పడుతుంది. ఈ భారాలు శాశ్వతం.

*కార్పొరేట్లకు లాభాలు-ప్రజలకు భారాలు*

గతంలో విద్యుత్తును లాభనష్టాలు లేకుండా ప్రభుత్వాలు ప్రజలకు ఒక సదుపాయంగా కనీస చార్జీలతో అందించేవి. కానీ 20 సంవత్సరాల నుండి విద్యుత్‌ సంస్కరణల పేరుతో విద్యుత్తును ఒక వ్యాపారం లాగా, లాభనష్టాలు లెక్కించి ప్రజల నుండి వసూలు చేసే కొత్త పద్ధతులు వచ్చాయి. నేడు కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఈ సంస్కరణలను దూకుడుగా అమలు చేస్తోంది. కేంద్ర విద్యుత్‌ చట్టానికి సవరణలు చేశారు. సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అప్పులు తీసుకుని ప్రమాదకర విధానాలను వేగంగా అమలు చేస్తున్నది. కరెంటు చార్జీలు నిర్ణయించే బాధ్యత నుండి తప్పుకుని విద్యుత్‌ నియంత్రణ మండలి (రెగ్యులేటరీ కమిషన్‌) ఏర్పాటు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. స్వతంత్ర సంస్థ పేరుతో కమిషన్‌ ద్వారా ప్రభుత్వ విధానాలు అమలు జరిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం విద్యుత్‌ పంపిణీ సంస్థలు రెగ్యులేటరీ కమిషన్‌ ముందు ఆదాయం, వ్యయం, చార్జీల ప్రతిపాదనలు పెడతాయి. వాస్తవ అంచనా కంటే అధిక ఖర్చులే చూపుతారు. అయినా ఖర్చు ఎందుకు పెరుగుతోంది? విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే బొగ్గు, గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచేస్తోంది. బొగ్గు గనులను బడా కంపెనీలకు కట్టబెట్టారు. బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. అవినీతి కుంభకోణాలు మామూలే. విద్యుత్‌ ఉత్పత్తి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. 47 శాతం విద్యుత్‌ ఉత్పత్తి ప్రైవేటు విద్యుత్‌ కంపెనీల చేతిలో ఉంది. ఈ కంపెనీలన్నీ కార్పొరేట్లు, పాలక వర్గ పార్టీల నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఆ కంపెనీలతో ప్రభుత్వాలు తప్పుడు ఒప్పందాలు చేసుకున్నాయి. అధిక రేట్లకు విద్యుత్‌ కొంటున్నారు. ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. ఇటీవల కాలంలో విద్యుత్‌ మిగులు ఉందని ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. ప్రైవేటు విద్యుత్‌ కంపెనీల నుండి అధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. సోలార్‌, పవన విద్యుత్తును యూనిట్‌ 12 రూపాయలకు కూడా కొనుగోలు చేసేందుకు గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పుల వలన ఆ విద్యుత్‌ యూనిట్‌ 3 రూపాయలకు పడిపోయింది. అయినా అధిక రేట్లు పెట్టి కొనుగోలు జరుగుతూనే ఉంది. ఒప్పందాల కాలపరిమితి పూర్తయినా బడా కంపెనీల నుండి విద్యుత్‌ కొనుగోలు చేస్తూనే ఉన్నారు. బడా కంపెనీలు విపరీతమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. నేతలు, ఉన్నత అధికారులు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ కార్పొరేట్ల లాభాలు, ప్రభుత్వాల అవినీతి, అక్రమాలకు ప్రజలను బలి చేస్తున్నారు. వీటి ఫలితంగానే ఖర్చు పెంచి సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై వేస్తున్నారు.

పడగ విప్పిన కేంద్ర సంస్కరణలు

కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలు, చట్ట సవరణల వల్ల మరింత ప్రమాదం పొంచి ఉంది. ఇక మీదట స్లాబులు అన్నీ రద్దు చేస్తే ఒకటే స్లాబు ఉంటుంది. పేదలు, మధ్యతరగతి కూడా ధనికులతో సమానంగా చార్జీలు చెల్లించాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం యూనిట్‌ 7 రూపాయల వరకు ఉండొచ్చు. ప్రతి సంవత్సరం ఖర్చులు పెరిగిన కొద్దీ ఈ ధర పెరుగుతూనే ఉంటుంది. రైతుల ఉచిత విద్యుత్‌కు ఎసరు పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ లకు సబ్సిడీలు పోతాయి. స్మార్ట్‌, ప్రీ పెయిడ్ మీటర్లు వస్తున్నాయి. సెల్‌ఫోన్‌ మాదిరిగానే ముందుగా డేటా కొనుగోలు చేసినట్టు ముందుగానే కరెంట్‌ కొనుగోలు చేయాలి. ఆ డబ్బు అయిపోగానే కరెంటు ఆగిపోతుంది. ఉద్యోగుల భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేస్తుంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. మోడీ మానిటైజేషన్‌ పాలసీలో భాగంగా ట్రాన్స్‌మిషన్‌ లైన్లు కూడా ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇస్తారు. కేంద్రం షరతులను వ్యతిరేకించి ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రానికి లొంగిపోయింది. ఇతర రాష్ట్రాల కంటే వేగంగా సంస్కరణలను అమలు చేస్తూ రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగిస్తోంది. గత ప్రభుత్వం ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలతో ఒప్పందాలు (పిపిఎ) చేసుకుని తప్పులు చేసిందని, వాటిని పున:సమీక్షిస్తామని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం హడావిడి చేసింది. బిజెపి, తెలుగుదేశం పార్టీలు, కొన్ని మీడియా వర్గాలు, పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెట్టాయి. ఈ సమస్య కోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా మెత్తబడింది. ఈ ప్రభుత్వం కూడా సోలార్‌ విద్యుత్‌ పేరుతో ప్రైవేటు కంపెనీలతో అధిక రేట్లకు దీర్ఘకాల ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకు రంగం సిద్ధమవుతోంది. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి సంస్థలతో తేడా తప్ప విధానాల్లో తేడా లేదని అర్ధమవుతోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు 20 వేల కోట్ల రూపాయల పైగా అప్పుల్లో ఉన్నాయని, అప్పులు తగ్గించడం కోసమే ట్రూ అప్‌ చార్జీల భారం వేశామని ప్రభుత్వం చెబుతోంది. బొగ్గు రేటు పెరిగిందని, బొగ్గు దిగుమతి చేసుకున్నామని, సామర్ధ్యం పెంపుకు డబ్బు అవసరమని...పలు సాకులు చెప్తూ విద్యుత్‌ సంస్థలు భారాలను సమర్ధించుకుంటున్నాయి. రుణభారం తగ్గించి పంపిణీ సంస్థలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కుట్ర ఇందులో ఇమిడి ఉంది. ప్రభుత్వం చేతిలో ఉంటేనే ఇన్ని భారాలు, ప్రమాదాలు తప్పడంలేదు. ఇక ప్రైవేటు చేతి లోకి వెళ్తే మొత్తం దొంగల దోపిడీ తప్ప ఇంకోటి ఏమీ ఉండదు.

*వాయిదాల పద్ధతిలో వడ్డన*
ట్రూ అప్‌ చార్జీల భారం అంతా గత ప్రభుత్వం యొక్క పాపం అని ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. గత ప్రభుత్వం చేసిన బకాయిలను చెల్లిస్తామని గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఈ బకాయిలను మాత్రం ఎందుకు భరించడం లేదు? ప్రజల మీద ఎందుకు రుద్దుతోంది? వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ పెద్దలు, అధికారులు తమ పాలనలో ప్రయివేటు సంస్థల దోపిడీ అరికట్టామని, పంపిణీ నష్టాలు తగ్గించామని గొప్పలు చెబుతూ...మళ్లీ తమ పాలనలోనే 2019-20, 2020-21 సంవత్సరాలకు లోటు వచ్చిందనే సాకుతో ట్రూ అప్‌ చార్జీల పోటుకు రంగం సిద్ధం చేయడం శోచనీయం. ఈ ప్రభుత్వం కూడా గత రెండు సంవత్సరాల కాలంలో కనపడకుండా కస్టమర్‌ చార్జీలు, స్లాబుల మార్పిడి ఇతర రూపాలలో విద్యుత్‌ భారాలు మోపింది. ఇది తాజా భారం. కేంద్ర బిజెపి ప్రమాదకరమైన విధానాలు అమలు చేస్తోంది. అన్ని చట్టాలను మార్చేస్తోంది. అందుకే రైతుల పోరాటంలో వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ చట్టం రద్దు చేయాలనే డిమాండ్‌ ప్రధానంగా ఉంది. ఆ బిజెపి విధానాలను వ్యతిరేకించాల్సిన ప్రాంతీయ పార్టీలు, వైసిపి, టిడిపి కేంద్రం బాటలో పయనించడం విచారకరం. టిడిపి 1997లో ప్రారంభించిన ఈ సంస్కరణలను తదుపరి కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాలు కొనసాగించాయి. సంస్కరణలు అమలు చేస్తే చౌకైన కరెంటు, నాణ్యమైన కరెంటు, నిరంతరాయమైన కరెంటు అని మాటలు చెప్పారు. ఈ సంస్కరణలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రజలపై అధిక భారాలు మోపాయి. విద్యుత్‌ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అయితే పాలక పార్టీలు ఈ భారాలు, సంస్కరణలను ప్రజల కళ్లుగప్పి అమలు చేస్తున్నాయి. దొడ్డిదారిన వీటిని రుద్దుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ రోజు, వారం, నెలనెలా పెంచుతున్నారు. అలాగే విద్యుత్‌ రంగంలోనూ ముక్కలు ముక్కలుగా, దశలవారీగా, రకరకాల పేర్లతో భారం మోపుతున్నారు. ఎన్నికల సమయంలో కప్పి పుచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలు ఆదమరిచి ఉన్న సమయంలో భారాలు రుద్దటం ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయింది.
కరోనా కష్టకాలంలో ప్రజలు బతకడమే కష్టంగా మారింది. ఆదాయాలు తగ్గిపోయాయి. ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. కానీ ఈ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌...ఇప్పుడు కరెంటు చార్జీలు పెంచడం అమానుషం. ట్రూ అప్‌ కాదు. ట్రూ డౌన్‌ చేయాలి. తక్షణమే ఛార్జీల భారాన్ని ప్రభుత్వం ఉపసంహరించాలి. ఆ వ్యయం ప్రభుత్వమే భరించాలి.
-సిహెచ్‌. బాబూరావు

Post a Comment

0Comments

Post a Comment (0)