ఆధ్యాత్మిక దృష్టి

Telugu Lo Computer
0



ఆధ్యాత్మిక దృష్టి అందరికీ అలవడదు. నూటికి తొంభై మంది లౌకిక విషయాల్లో మగ్నమై జీవితం గడిపేస్తారు. ఇలా చేయడం వల్ల ఏ తేడా లేదు. ఆధ్యాత్మిక దృష్టి, ఆధ్యాత్మిక ఆసక్తి లేని వారిని అలా వదిలేయడం ఉత్తమం. వారంతట వారు ఆధ్యాత్మికత వైపు దృష్టి మరల్చ కుండా ఇతరులు వారిని బలవంతం చేయడం శుద్ధ అనవసరం. అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నమా‌అని మనకి సామెత. మనసు పరిణితి,  పరిపక్వత పొందక ఆధ్యాత్మిక పథంలోకి దింపడం వృథా ప్రయాస. జీవితం అందరినీ వంచుతుంది. అలసట కలిగిస్తుంది. ఆ సమయంలో ఎవరికి వారు ఆధ్యాత్మికత వైపు దృష్టి మరల్చు కుంటే ఆశించిన ఫలితం ఉంటుంది. మతం రెండు భాగాలు. మొదటిది పూజా, పునస్కారములు, ఇతర వ్రతాలు, క్రతువులు, సామూహిక దైవ ప్రార్థన, మొదలైనవి. భగవద్గీతలో చెప్పినట్లు, ఆర్తుడు, ధనం సంపాదించడం, ఆస్తిపాస్తులు కూడబెట్టడం పై దృష్టి ఉన్నవారు, జిజ్ఞాస కల వారు, జ్ఞానులు భగవంతుని తలుచుకునే వారిలో, ప్రార్థించే వారిలో, పూజించే వారిలో వివిధంగా ఉంటారు. జ్ఞాని తప్ప మిగిలిన వారందరికీ మొదటి భాగం నచ్చుతుంది. వారిని అలానే నడవ నివ్వాలి. జీవితం కలిగించిన వడి దుడుకులకు అయాస పడి, సాంత్వన కోసం వారు భగవంతుని శరణు జొచ్చుతారు. ఆయన వారి కష్టములు పోగొట్టి వారికి ఉపశమనం కలిగిస్తాడు. కోరికలు తీర్చి సంతోష పెడతాడు. ఇదంతా ఆధ్యాత్మికత కాదు. భగవంతుని పట్ల ప్రపత్తి అంతే. తత్త్వాన్ని తెలుసుకోగోరడం మతం యొక్క రెండవ భాగం. ఈ దృష్టి కొందరికే కలుగుతుంది. వారి సంస్కారాలను బట్టి నచ్చిన మార్గంలో ముముక్షువులు అవుతారు. ఇటువంటి వారికి మాత్రమే ఉపనిషత్తులు, బ్రహ్మ జ్ఞానము, ఆత్మ వివరము తెలపాలి.

మొదటి రకం వారికి పురాణములు, రామాయణ, భారత, భాగవతములు, చాలు. వారి అవసరాలు, వీటి ప్రవచనములను వినడం వల్ల తీరుతాయి. అంతకు మించి కష్టపడనవసరము లేదు. జీవితం భగవంతుని నమ్ముకోవడం వల్ల సాఫీగా సాగిపోతుంది. తత్త్వము, ఆత్మ, బ్రహ్మ జ్ఞానములు వైరాగ్యం లేనివారికి ఉపయోగించవు. వారు అభ్యాసం చేస్తే ఆత్మానుభవం పొందుతారు. బ్రహ్మ స్థితిని చేరతారు. ఆధ్యాత్మికత అంటే ఇది మాత్రమే. చిన్నప్పటి నుంచి దైవ ప్రార్థన, నామస్మరణ, పూజా పునస్కారముల గురించి చెప్పి, నేర్పితే చాలు. తత్త్వం వారికి అధిక శ్రమని కలిగించి ఉపయోగించదు.  నిజానికి మనసు భగవంతుని లో లీనం కావడమే ఆత్మానుభవం. అది భక్తి, కర్మ మార్గాలలో చాలా మందికి కరతరామలకం అవుతుంది. జ్ఞాన సముపార్జన చేస్తూ, జ్ఞాన మార్గంలో పయనించడం శ్రమ భూయిష్టమైన పద్ధతి. భక్తి, జ్ఞాన, కర్మ మార్గముల ధ్యేయం ఒకటే గనుక, జ్ఞాన మార్గంతో అందరినీ ఊదర కొట్టడం వారిని ఎంతో శ్రమ పెడుతుంది.  అందుకని ఆర్తుడు, అర్ధార్ధి, జిజ్ఞాసువు తమ తమ అర్హతలకు అనుగుణంగా, అనుకూలంగా ఆధ్యాత్మిక పథం ఎన్నుకోవడం తెలివైన పని. తత్త్వ పరంగా ఆధ్యాత్మికత అనుసరించే దృష్టి, ఆసక్తి, శక్తియుక్తులు అందరికీ ఉండవు. వారు శ్రమ పడక సులువైన పంథాలో భగవద్దర్శనం చేసుకోవడం ఉత్తమోత్తమం.

Post a Comment

0Comments

Post a Comment (0)