ఆరు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పష్టం చేశారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి సింధియా శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గౌరవార్థం సీఎం కేసీఆర్ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అనంతరం జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎకానమిక్ గ్రోత్ సెంటర్ గా అభివృద్ధి చెందడంతోపాటు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా రూపుదిద్దుకుంటున్నం దున, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్రమంత్రిని కోరారు. బిజినెస్ హబ్‌గా, ఐటీ హబ్‌గా, హెల్త్ హబ్‌గా, టూరిజం హబ్‌గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల నుండి ప్రయాణికులు వస్తున్నందున సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్ లకు హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి సింధియా దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ నుంచి ప్రతిపాదనలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తగిన సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సింధియా.. దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి, విమానాశ్రయ విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ నుంచి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్ (ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్‌పల్లి)లో ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టును ఎయిర్‌ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్ నగర్ (దేవరకద్ర) ఎయిర్‌పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేలా చేయడానికి పున: పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి సింధియా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ సెక్రటరీ ప్రదీప్ కరోలా, జాయింట్ సెక్రటరీ దూబే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణా రావు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)