తిరుమల దేవభూమి!

Telugu Lo Computer
0


ఎన్నిసార్లు వెళ్లినా తృష్ణతీరని స్వర్గసీమ! అసలీ క్షేత్రంతో, స్వామితో ప్రేమలో పడకపోతే జీవితంలో ఉన్న అమృతాన్ని ఎలా ఆస్వాదించగలము? ఎంతమంది ఎన్ని రకాల శ్రమలకోర్చి ఇక్కడికి చేరుకుంటారు? అందరినీ కంటికి రెప్పలా కాచుకుని, కోర్కెలు తీర్చి పంపుతారు స్వామివారు‌. పుట్టినరోజు కు అక్కడకు కుటుంబసమేతంగా వెళ్లాలని‌ ముందుగా అనుకున్నాము. ఆత్మీయులు కొందరి సాయంతో ముందుగా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఆరోజున కన్నుల పండువగా స్వామి దర్శనమయ్యింది. ఆపాదమస్తకం ఆ దివ్యరూపాన్ని కన్నులతో గ్రోలడానికి ఎంత సమయమిస్తే మాత్రం ఏం సరిపోతుంది? తనివి తీరని మనసులతో బయటపడగానే, తర్వాత అనుకోని వరంలా లభించిన వేద ఆశీర్వచనం చేస్తుండగా కళ్లలో ఉద్వేగంతో నీళ్లు తిరిగాయి. ఇంతకన్నా గొప్ప పుట్టినరోజు వేడుక ఏముంటుంది?

సరే, ఆరోజు స్వామి ప్రసాదమే భోజనంగా తీసుకోవాలని అనుకున్నాము. వెంగమాంబ అన్నసత్రంలో రష్ బాగా ఉండడంతో ఒక గది ముందు ఉన్న గార్డు, మమ్మల్ని 'లోనికి వెళ్లండి, నాలుగు ఖాళీలున్నాయి' అన్నారు. తీరా వెళ్లాకా మూడే ఖాళీలున్నాయి. అమ్మా వాళ్లను కూర్చోమని నేను నిల్చున్నాను. ఈలోగా అక్కడ భోజనశాల సూపర్ వైజర్ వచ్చి, 'కూర్చోండమ్మా, వడ్డిస్తాములే' అన్నారు. స్పెషల్ కోటా గా పెద్ద గరిటెడు నెయ్యి పారే వేడివేడి చక్కెరపొంగలి,  ఎక్కువ కూర, సాంబారు ఇత్యాదులు. ముందా పొంగలి తినేసరికే బొజ్జ నిండిపోయింది. ఆ అమృతాన్ని హాయిగా తినేసి బయటికొచ్చాను. భక్తులపై స్వామివారి వాత్సల్యానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే! లేకపోతే అంత రష్ లో కూడా నాకు ప్రత్యేక హోదా ఇవ్వక్కర్లేదు కదా! సాయంత్రం ఆనందనిలయం పరిసరాల్లో తిరుగుతుండగా చాలాసేపు ఒక వింత కాంతి ఆనందనిలయం ఎగువన ప్రసరిస్తూ ఉండడం చూసాము. జతపరచిన చిత్రం చూడగలరు.

ఇక ఈసారి పాట ఎలా పుట్టిందంటే... ఈసారి ఆలస్యంగా బయలుదేరడం వల్ల తిరుమల చేరుకునేసరికి రాత్రివేళ అయిపోయింది. ఆకాశంలో నిండు చందమామ, పండు వెన్నెల! ఆ నిశీధి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా పుట్టిన పల్లవి... 'అదృష్టవంతులట అలసూర్యచంద్రులు!'

ఎందుకని? వారికి మనలాగా పరిధులు, పరిమితులు లేవు. ఎప్పుడు స్వామి చెంతనే ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటారు. అలాగే, ఎటువంటి ప్రయాస లేకుండా తిరుమలలో కొలువై ఉన్న పక్షులు, జంతువులు, వనాలు అన్నీ గొప్ప అదృష్టం చేసుకున్నాయి. వాటి నిత్యనివాసం ఆనంద నిలయం చెంతనే! 

అంతెందుకు, జన్మలన్నిటిలోను మానవ జన్మ చాలా గొప్పదని భావిస్తాం కానీ మనకన్నా స్వామి కోవెలకు ప్రహరీ కట్టే బండరాళ్లు,  లోహాలు, మట్టిలో పుట్టి స్వామి ఆభరణాలలో చేరిన మణి మాణిక్యాలు, గొప్పవి కదూ! చివరికి మనం అల్పమైనవని ఈసడించుకునే పట్టుపురుగులు కూడా తమ ప్రాణాలను దారాలుగా మలచి, ఆ స్వామివారికి వస్త్రాలను కూరుస్తున్నాయి. ఇంతకంటే ఒక‌జన్మకు ధన్యత ఏముంటుంది?

చక్కని కోనేటిలో ఉన్న జలాలు స్వామిని అభిషేకించి తరిస్తున్నాయి. ఎగిరే తూనీగలు, క్రిమికీటకాలు, ఏదో ఒక రకంగా స్వామిని చేరుకుని సేవిస్తున్నాయి. మరి ఓ‌మనిషీ! వీటన్నిటికన్నా నీవెలాగ గొప్పవాడివి? అలా చెప్పుకుని నవ్వులపాలు అవుతావేమి? నాగరికత పేరుతో నువ్వు గీసుకున్న గిరులతో నువ్వే స్వామిని చూసేందుకు ప్రయాస పడుతున్నావే, నీకన్నా ఇవన్నీ అదృష్టం చేసుకున్నాయి కదా, అనిపించింది. ఇదే భావన పాటగా మీకోసం...

పల్లవి:

అదృష్టవంతులట అల సూర్యచంద్రులు

అనిలనీరదములు ఆకాశమునున్న దివిజులు

చ1:

పాలవెల్లిగ దివిని భాసించు తారకలు 

పూలతేరుగ భువిని పొడమేటి వనములు

కువకువల రవళులతొ కూజించు పికములు

ఏ శ్రమయు లేకనిట ఇరవై ఉండుగద

చ2:

మట్టి ఒడిని పుట్టు మణులు మాణిక్కెములు

గట్టి ప్రహరీ కూర్చు గట్టు బండరాళ్లు

పట్టు దారములిచ్చు పలు పట్టుపురుగులు

చుట్టినిను చేకొని చెంగటనె నిల్చుగద

చ3:

తెరగు ప్రోక్షణ సేయు తెలినీటి ధారలు

పరచు తూనిగలు, పలుజీవజంతులు

పరిపరి విధములుగ పదసేవ సేయగా

నరులమంచును పొంగి నగుబాటు కానేల?

Post a Comment

0Comments

Post a Comment (0)