ఇంద్రియాల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు!

Telugu Lo Computer
0


ఒక అడవిలో ఒక కోతుల గుంపు వున్నది. అందులో ముఖ్యమైన కోతి  మిగిలిన కోతులతో ఒకరోజు ఇలా అన్నది.

  "మానవులు ఏకాదశినాడు ఉపవాసముండి ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నారు. మనం మాత్రం ఏం ? మనం

కూడా ఏకాదశి ఉపవాసముందాం, సరేనా! "

  ఈ ప్రతిపాదనకు మిగిలిన కోతులన్నీ అంగీకరించాయి. ఏకాదశి రాగానే ఈ కోతులన్నీ ఒక చెట్టుకింద సమావేశమై ఉపవాస దీక్షలో కూర్చున్నాయి. కళ్లు మూసుకుని కాస్సేపు ధ్యానంలో నిమగ్నమయ్యాయి. 

  కొంతసేపు గడిచింది. ఒక కోతి అన్నదికదా!

   " ఇలా ఈ నేలపై క్రింద కూర్చుంటే మనకు రక్షణ ఏముంటుంది? ఏదైనా ఏనుగుల గుంపు ఇటు వెళుతూ

మనలను తొక్కిపోవచ్చు లేదా ఏ పులో ఇటుగా వచ్చి మనలను చంపి తినివేయవచ్చు. అసలు మనం శాఖా మృగాలం. చెట్ల కొమ్మలపై వుండడమే మనకు అలవాటు. అందు వలన చెట్లెక్కి కూర్చుందాం. అయితే కొమ్మల మొదట్లోనే కూర్చుందాం. అలా పండ్లకు దూరంగానే వుండవచ్చు. "

 మిగతా కోతులన్నీ సరేనన్నాయి. గబగబా కొమ్మలపైకి చేరిపోయాయి. ఇలా కొంతసేపు గడిచింది. ఇంతలో ఒక కోతి ఇలా సూచించింది.

  "మనందరం ఇలా కొమ్మల మొదట్లో వున్నాం. చిరుతపులి లాంటివి చాలా తేలికగా చెట్లెక్కిమనదాకావచ్చేస్తాయి.

మనం ఇంకొంచెం పైకి వెళితేనే మంచిదేమో చిరుత పులుల బరువుకు కొమ్మలు విరిగినా విరుగుతాయి. అదే చిటారు కొమ్మన వుంటే మనం తటాలున ఇంకో కొమ్మ మీదకు దూకి ప్రాణాలు దక్కించుకోవచ్చు. అలాగే సర్పాలు వగైరా దగ్గరగా వచ్చినా బ్రతికి బైటపడవచ్చు. అయితే కొమ్మల చివరన వున్ననూ పండ్లపై దృష్టి పెట్టకుండా నేలమీదకే చూస్తూ వుందాం. ఆ విధంగా శత్రువుల ఉనికినీ ఎప్పటి కప్పుడుతెలుసుకోవచ్చు."

  ఇదికూడా బాగానేవుందని కోతులు ఒప్పుకున్నాయి. మరికొంతసేపు గడిచింది. ఇంకొక కోతి అన్నది కదా!

" చూడండి!  ఇలా నేలమీదకే చూస్తూ ఎంతసేపని వుంటాం. విసుగు కదా! కొంతసేపు క్రిందకు, మరికొంతసేపు అన్నివైపులాచూస్తూ కాలం గడుపుదాం పొరబాటున మన దృష్టి ఈ కొమ్మల చివరన గల పళ్లపై పడిననూ ఫరవాలేదు. మన ఉపవాస దీక్షకు వచ్చిన నష్టమేమీలేదులే."

  వెంటనే కోతులన్నీ ఈ సలహాను అమల్లోకి పెట్టాయి. కొంతకాలం గడిచింది. మరో కోతి అందరివంక జూచి 'నా సలహాను కూడా వినండి'

అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది.

  "మనం ఎలాగూ పండ్లను చూస్తూనే కూర్చున్నాం. ఇవాళ ఉపవాస కారణంగా రేపు మనకు ఆకలి ఎక్కువగా వుండి మంచి పండ్లను ఏరుకునితినే సమయం, సహనం వుండకపోవచ్చు. అందువలన ఎయే పండ్లు బాగా ముగ్గి తినడానికి వీలుగా వుంటాయో లేవో మనం ఇప్పుడే పరీక్షించి పెట్టుకోవచ్చు. ఏమంటారు!"

  మిగతా కోతులన్నింటికీ ఈ సలహా బాగా నచ్చేసింది. ఇక ఆ కోతులన్నీ పండ్లను పట్టుకుని చూడడం ప్రారంభించాయి. మంచిపండ్లు అనుకున్న వాటిని మరికొంతసేపు పరిశీలిస్తూ పట్టుకుకూర్చున్నాయి. 

ఇంతలో ఒక ముసలి కోతి ఏమందంటే -- "ఈ రోజు ఉపవాసం కాబట్టి రేపు మనం మంచి ఆకలితో వుంటాం. మరింత బలహీనంగా కూడా వుంటాం. అందువలన రేపటికోసం మంచి పండ్లను ఈ రోజే కోసి దాచిపెట్టుకుంటే మంచిదికదా!"

  ఈ సలహా చాలా చక్కగావున్నట్లు అనిపించింది కోతులన్నింటికీ. వెంటనే అవి మంచిమంచి పండ్లను కోయడం ప్రారంభించాయి.

  ఈ సమయంలో మరో వృద్ధవానరం  అన్నది.

  " చాలా పండ్లు చూడటానికి చాలా బాగానే వుంటాయి. పైకి ముట్టుకు చూసినా పెద్దగా ఏమీ తెలియదు.  అందువల్ల మనం ఆ పళ్ల వాసన కూడా చూడాలి. " 

  ఈ సలహాను తూచ పాటిస్తూ కోతులన్నీ గబగబా మంచి వాసన కలిగిన పళ్లన్నీ ఏరుతూ చెడువాసన కలిగినపళ్లనువిసిరిపారవేయసాగాయిఇలా కొంతసమయం గడిచిన తదుపరి ఇంకొక వృద్ధవానరం ముందుకు వచ్చింది.

   "చాలా పండ్లు చూడడానికి బాగానే వుంటాయి. వాసన కూడా బాగానే వుంటుంది. కాని 'పొట్టవిప్పి చూస్తే పురుగులుండు' అనేట్లుగా వుంటుంది. కావున ప్రతిపండును కొంచెం కొరికి రుచి చూస్తే తప్పేమీలేదు. కొరుకుదాం అంతే మింగవద్దు. అప్పుడు మన ఏకాదశి ఉపవాసానికి ఎటువంటి భంగం వాటిల్లదు. పళ్లను రుచి చూస్తున్నాం అంతే! "

మన కోతులన్నింటికీ ఈ సలహా అద్భుతమనిపించింది. వెంటనే ఈ సలహాను ఆచరణలో పెట్టాయి. గబగబా కోతులన్నీ పండ్లను రుచి చూడసాగాయి. పనిలోపనిగా పాపం తినడం కూడామొదలెట్టేసాయి. 

కోతుల ఏకాదశీ ఉపవాసవ్రతం అలా ముగిసిపోయింది.

కొసమెరుపు: ఇంద్రియాలకున్న శక్తిని తక్కువగా అంచనావేసి తనచర్యలను తప్పుడు ధోరణిలో సమర్థించుకుంటూ పోవడమే మన నైతిక, ఆధ్యాత్మిక పతనానికి ముఖ్య కారణం.

( శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థమహాస్వామి వారి కథలు)

Post a Comment

0Comments

Post a Comment (0)