ఆర్కాట్ పార్థసారథి కోమల

Telugu Lo Computer
0


దక్షిణభారతదేశపు నేపథ్యగాయని. ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, మళయాలం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది. కోమల మద్రాసులోని తిరువళ్ళికేనులో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారథి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి రాజమండ్రి నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చారు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది తెలుగుదేశంలోనే. తొలిసారిగా ఒరిస్సాలోని బరంపురంలో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో ముత్తుస్వామి దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు. సంగీత అవగాహన ఉండటం వలన 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఈమెకు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. రేడియోలో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో విద్యార్థినిగా పాల్గొనేది. అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కోమల ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే ఈ పాటకు ఆమె 250 రూపాయల పారితోషికం అందుకున్నది. ఈమె సినిమాలలో పాడిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం. ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.

Post a Comment

0Comments

Post a Comment (0)