కల్పకం ఏచూరి

Telugu Lo Computer
0


దశాబ్దాల తరబడి మహిళల సాధికారతే లక్ష్యంగా, ఆర్థికంగా వారిని పరిపుష్టులను చేయడం, అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కృషి చేసిన ఆదర్శమూర్తి ఆమె. తన బాల్యం నుంచి ఇప్పటివరకూ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ బాటలో నడిచారు. అనేకమందిని ఆర్థిక స్వావలంబన సాధించేలా తీర్చిదిద్దారు. ఆ స్ఫూర్తిదాత పేరు కల్పకం ఏచూరి. సిపిఎం పధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి.

పాపాయ్యమ్మ, కందా భీమశంకరం దంపతులకు 1933 జూన్‌ 6న మద్రాసులో కల్పకం జన్మించారు. బాల్యం నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. స్వాతంత్య్ర సమరయోధురాలు వేముగంటి బొప్మాయమ్మ, అనేకమంది ఇతర కార్యర్తలతో కలసి విద్యార్థి రోజుల నుంచీ పనిచేశారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ అంటే వల్లమాలిన అభిమానం. ఆమె మాటల్లో చెప్పాలంటే స్ఫూర్తిప్రదాత. దేశ్‌ముఖ్‌ నడిచిన మార్గంలోనే నడిచి తన అభిమానాన్ని చాటుకున్నారు. బాల్యంలో దుర్గాబాయి ఏర్పాటు చేసిన బాలికాసేనలో సభ్యురాలిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆమెకు బాల్యంలోనే యేచూరి సర్వేశ్వర సోమయాజులుతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. అర్ధంతరంగా ఆగిపోయిన చదువును పెళ్లి తర్వాత కూడా కొనసాగించారు కల్పకం. అభ్యుదయ భావాలు గల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మద్రాసు క్వీన్‌ మేరీస్‌ కాలేజీలో చదివారు. తండ్రి భీమశంకర్‌ మద్రాసు హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. ఆ రోజుల్లోనే బాలికలు, మహిళల విద్యావకాశాలను పెంపొందించడంలో తల్లితో పాటు దుర్గాబారు స్థాపించిన ఆంధ్ర మహిళా సభకు వెళ్లి స్వచ్ఛంద సేవలు చేసేవారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి మద్రాసు వచ్చిన ఎంతోమంది పేద విద్యార్థులకు ఆమె పుట్టిల్లు ఆశ్రయం ఇచ్చేది.

దుర్గాబాయ్‌ క్రమశిక్షణ, ఒకే పనికి పరిమితం కాకుండా స్త్రీల సంక్షేమం కోసం, వారి జీవనభృతికి తోడ్పడే రకరకాల చేతిపనులు ఆంధ్ర మహిళా సభలో చేయించడం ఆమెను విశేషంగా ఆకర్షించాయి. ఆ ప్రేరణతో వివాహానంతరం కూడా భర్త సహకారంతో కాకినాడలో స్వగృహంలోనే దివ్యాంగులైన ఆడపిల్లలకు విద్యావసతి సౌకర్యాలు ఏర్పర్చారు. దివ్యాంగ ఆడపిల్లలకు కూడా కుట్లు, అల్లికలు నేర్పించి వారికి ఆదాయం వచ్చేలా చేశారు. ఆమె తన దుస్తులు తానే స్వయంగా కుట్టుకునేవారు.

దుర్గాబాయ్‌ రాష్ట్రానికి వచ్చినప్పుడు, హైద్రాబాద్‌, ఢిల్లీ కేంద్రంగా ఆంధ్ర మహిళా సభ సంస్థను నిర్వహిస్తున్నప్పుడు ఆమెతో పాటు కృషిచేశారు కల్పకం. భర్త యుఎన్‌లో పనిచేస్తున్నప్పుడు ఆమె 'ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌'పై సిద్ధాంత వ్యాసం సమర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణంపై డ్రాప్టు కమిటీ ఏర్పరిచినప్పుడు స్టీరింగ్‌ కమిటీలో కీలకపాత్ర వహించిన దుర్గాబాయ్‌ ప్రేరణగా ఇది రాసి ఉండవచ్చు.

మద్రాసు స్టెల్లా మేరీస్‌ కాలేజీలో బిఎ ఎకనామిక్స్‌ ఫైనల్‌ పరీక్షలు రాస్తున్నప్పుడు కల్పకం నాలుగు నెలల గర్భిణి. ఆ బిడ్డే సీతారామ్‌ ఏచూరి. బిడ్డ పుట్టిన తరువాత కూడా ఆమె చదువును కొనసాగించారు. బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్‌ సైన్స్‌, ఉస్మానియా యూనివర్శిటీలో 'ఇండియా అండ్‌ ద యుఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌'లో ఎం.ఫిల్‌ చేశారు. రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె ఆలిండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ కోసం తీరిక లేకుండా పనిచేసేవారు.

ఎఐడబ్ల్యుసితో ఆమెకు ఆరు దశాబ్దాల అనుబంధం ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బయోగ్యాస్‌, పొగలేని చుల్హా ప్రాజెక్టులు, ఇంధన సంరక్షణ, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌, మూలికా తోటపని, పంచాయతీ స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ మైక్రో క్రెడిట్‌, గ్రామీణ శక్తి ద్వారా మహిళల సాధికారత, యూనిఫెమ్‌ సహకారంతో ప్రాజెక్ట్‌ మేనేజర్స్‌కు శిక్షణ వంటి అనేక శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాపులు నిర్వహించారు. గ్రామంలో నేత కార్మికులకు కొత్త మగ్గాలు ఇవ్వడం, వినియోగదారుల ఎంపికకు అనుగుణంగా, ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడం, కొత్త డిజైన్లతో వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆమ్‌ పాపడ్‌ తయారీ, మార్కెటింగ్‌ ప్రారంభం, సామర్థ్యాలను మెరుగుపరచడం వంటి వాటిలో నిరంతర సాయం అందించి గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో వందలాదిమంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా మారే వీలు కల్పించారు.

దక్షిణాఫ్రికా డర్బన్‌లో జరిగిన సిఒపి-17 (వాతావరణ మార్పులపై సమావేశం) గ్లాస్గో, బ్రిటన్‌, యుకె, ఫోరెన్స్‌, ఇటలీ, మలేషియాలో గ్లోబల్‌ వాటర్‌ పార్టనర్‌షిప్‌, బంగ్లాదేశ్‌లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు కల్పకం హాజరయ్యారు. మెక్సికో, యునిఫెమ్‌, యుఎన్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఫర్‌ ఉమెన్‌, ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌, సార్క్‌ అండ్‌ యునెస్కో కాన్ఫరెన్స్‌ ఆన్‌ నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ, బీజింగ్‌ వర్క్‌షాప్‌ ఆన్‌ ఎనర్జీ ఫర్‌ ఎ బెటర్‌ లైఫ్‌, ఉమెన్‌ అండ్‌ రూరల్‌ఎనర్జీ, ఎక్స్‌పో-2000, హన్నోవర్‌ వంటి వినూత్న అభ్యాసాలకు అవార్డులు అందుకొన్నారు. పునరుత్పాదక శక్తిలో ఎఐడబ్ల్యుసి తరపున ఆసియా పసిఫిక్‌ మైక్రో క్రెడిట్‌ సమ్మిట్‌ సమావేశం, బంగ్లాదేశ్‌, 32వ త్రైమాసికంలో ఐఎడబ్ల్యు, కొలంబో, శ్రీలంకలో పాల్గొన్నారు. అఖిల భారత మహిళా మోటార్‌ ర్యాలీలో గిరి మెమోరియల్‌ అవార్డును అందుకున్నారు. హిమాలయాల్లో, ఢిల్లీలో జరిగిన ఛారిటీ కార్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఆమె చేసిన భారతనాట్య ప్రదర్శనలకు 80కి పైగా పతకాలు అందుకున్నారు.

కల్పకం రెండవ కుమారుడు భీమశంకర్‌ ఏచూరి మారుతి ఉద్యోగ్‌ నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె సోదరుడు కందా మోహన్‌ ఐఎఎస్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపక సభ్యురాలుగా ఆమె ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ వికలాంగ బాలికల పాఠశాల, బాలభవన్‌లకు కన్వీనర్‌గా సేవలు అందించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్ర మహిళా మండలి అక్షరాస్యత ఉద్యమం, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలిగా, రాష్ట్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ, ఢిల్లీ, ఆంధ్ర వనితామండలి కోశాధికారిగా .. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు.

ఆలిండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌, కాకినాడ బ్రాంచి ప్రతి ఏడాది మహిళల అభ్యున్నతి, సాధికారత రంగంలో విశేష సేవలు చేసిన ప్రముఖ వ్యక్తులకు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పేరిట అవార్డు ప్రదానం చేస్తోంది. దుర్గాబాయ్‌ జయంతి సందర్భంగా ఈరోజు ఆ అవార్డును, ప్రశంసా పత్రాన్ని కల్పకం అందుకోబోతున్నారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల ఆమె ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఢిల్లీ నుంచి ఆన్‌లైన్లో కొద్దిసేపు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారానికి మొదటి గ్రహీత కల్పకం.

Post a Comment

0Comments

Post a Comment (0)