మరోసారి తలచుకుందాం!

Telugu Lo Computer
0


అల్లూరి సీతారామరాజు చిన్నతనంలో నేర్చిన రంగస్థల నటనానుభవం కూడా స్వతంత్య పోరాటంలో ఉపయోగించారు.

కాకినాడలోని పిఠాపురం ఉన్నత పాఠశాలలో రామరాజు చదువుతున్నప్పుడు ఐదవ జార్జి చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాలు(George Frederick Ernest Albert; 3 June 1865 – 20 January 1936) ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో ఒకటి మనం మాయాబజార్ సినిమాలో చూసిన కథ అందులో శశిరేఖ ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉండటమే కాదు తన హావబావాలతోనూ అందరినీ ఆకట్టుకుంది మరోపాత్ర త మాటలతో కథని అనేక మలుపులు తిప్పే నారదుడు ఘటనలకు నటన సూత్ర దారి. ఒకటి స్త్రీ పాత్ర మరొకటి పురుష పాత్ర ఆ రెంటిలోను పరకాయ ప్రవేశం చేసినట్లు అద్భుతంగా నటించి మెప్పించింది ఎవరో కాదు ఇంత పెద్ద గడ్డంతో మన్యం వీరుడిగా గుర్తొచ్చే మన అల్లూరి సీతారామరాజు ఆయన పుట్టిన ఈ రోజు జులై 4 సందర్భంగా ఓ సారి ఆ మహనీయుడి స్ఫూర్తి మనసులో నింపుకుందాం.
పైన చెప్పిన సంగతి రామరాజు గారయితే చెప్పేంత తెరపి చేసుకోలేదు కానీ అప్పటి ఆయన మిత్రుడు ఆంధ్రా నేతాజీగా సుప్రసిద్ధుడైన మద్దూరి అన్నపూర్ణయ్య (1898 - 1953) తను నిర్వహించే కాంగ్రెస్ అనే పత్రికలో 1928 జూన్ 19వ తేదీ నాటి వ్యాసంలో ఈ రంగస్థల ముచ్చట తలచుకున్నారు. ఇదే కాకుండా సీతారామరాజు మన్యం పోరాట గాధలు అనేకం దీనిలోనే రాశారు. ఈయన చిచ్చుల పిడుగు వ్యాసానికి బ్రిటిషు ప్రభుత్వం 18 నెలల కఠిన శిక్షను విధించింది అంటే ఈయన మాటల పదును అర్ధం చేసుకోవచ్చు.అల్లూరి శశిరేఖగా ఉన్న ఫోటో లు తీసారో లేదో కానీ ఆ పాత్ర ధరించినప్పుడు పసిడి పాలబుగ్గల అందం మన వరకు అందిస్తున్న ఫోటో ఒకటి మిగిలింది.
మద్దూరి వారు ఆ నాటి కాంగ్రెస్ పత్రికలో ఇలా రాశారు
“మే మిరువురము ఆ నాటకములో పాత్రలను ధరించితిమి. రాజు స్త్రీ, పురుష పాత్రలను రెంటిని అత్యుత్తమముగ నిర్వహించెను. అతని రూపము, గానాభినయములు సభాసదులను ఆనంద పరవశుల చేసినవి. ఆ దివ్య సుందర విగ్రహము ఇప్పటికిని కన్నులకు కట్టినట్లున్నది. ఆకాలమున ఇతనికి కవిత్వమునందు అభిరుచి హెచ్చుగా నుండెడిది. కొన్ని పద్యములను గూడ అల్లి మనోహరముగా పాడువాడు. నాటకానంతర మీతనిలో యొక్క గొప్ప మార్పు గోచరించెను. పూర్తిగా పాఠములపై అశ్రద్ధ జనించెను.
ఏకాంత వాసమునందు ప్రీతి యుద్భవించెను."
అది సరే
రామరాజు ఒకే సారి పలు పోలీస్ స్టేషన్ లపై ఏక కాలంలో దాడిచేస్తానని టపాలతో సమాచారం ఇచ్చిమరీ అలాగే చేసేవాడు. అక్కడా రామరాజు ఇక్కడా రామరాజు వచ్చాడని స్టేషన్ సిబ్బంది వణుకుతూ చెప్పేవాళ్ళు. ఒకరికి కొలను గట్టున ధ్యానం యోగ చేస్తూ కనిపిస్తే ఇంకొకరు గూడెంలో మాట్లాడుతున్న రాజు గారిని చూసాం అనే వాళ్ళు. ఆఖరుకు తనంతట తానే వెళ్లి తూటాలకు ఎదురుగా రొమ్ము విరుచుకుని నిలబడి వీరమరణం పొందిన తర్వాత కూడా అసలు తమకు దొరికింది రామరాజేనా కాదా అనే అనుమానంతో నులక మంచానికి ఆయన దేహాన్ని కట్టి మోసుకుంటూ గూడెంలో వాకబు చేశారట తెల్లవాళ్ళు. అవును రామ రాజు అంటే ముఖ కవళికలు కాకుండా ఆహార్యం గుర్తొచ్చేలా చేస్తే ఈ బాడీ డబల్ మరింత సులభం అవుతుంది కదా. గుండెల నిండా ఉన్న దేశ భక్తిని ఆకర్షించే మాటల పదునుని, గురితప్పని బాణం దిశని, నిలకడ పెంచే యోగ శక్తిని, ప్రోదిచేసి పెంచుకున్న గూడెంలో నమ్మకాన్ని మాత్రమే కాదు ఇలా రంగస్థలం పై నటించిన అనుభవాన్ని కూడా ఆయన లక్ష్యం కోసమే వాడారు. సీత లేని దుఃఖాన్ని కూడా పేరు ముందు బాణపు కోసలా ప్రయోగించారు. ఆయన మరణం తర్వాత కూడా ఉన్నాడని మన్యం నమ్ముతూనే ఉండేది. ఎక్కడో ఏదో రూపంలో ఆయన మనకోసం పనిచేస్తున్నసడని విశ్వసించేది. ఆఖరికి బెండపూడి సాధువు లాంటి వారు రామరాజు కావచ్చని ప్రముఖులెందరో పరిశీలించి చూసారు. భౌతిక రూపం లేకపోవచ్చు స్ఫూర్తిదాతగా ఆయానిప్పటికీ బ్రతికేవున్నారు వుంటారు కూడా. RRR మూలకథలో మన్యం వీరులిద్దరు ఒకరినుంచి ఒకరు స్ఫూర్తి అందుకుని ఉంటే ఎలా ఉంటుందనే లైన్ ఆధారంగా నిర్మించబడుతున్నట్లు వింటున్నాం. నటించే హీరోల పుట్టిన రోజులకు టీజర్స్ విడుదలయినట్లు నిజమైన హీరోల జన్మదిన స్ఫూర్తిని నెమరేసుకుందాం.

Post a Comment

0Comments

Post a Comment (0)