జొమాటోకు ఎందుకింత డిమాండ్‌?

Telugu Lo Computer
0


జొమాటో షేర్లు స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలిరోజే దుమ్ము రేపుతున్నాయి. ఈ కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.76 కాగా.. దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్టయ్యింది. దీంతో 2020 తర్వాత ఐపీఓకి వచ్చిన సంస్థల్లో 50 శాతం ప్రీమియం లిస్టింగ్‌ సాధించిన 10 కంపెనీల జాబితాలో చేరింది. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో సెన్సెక్స్‌లో జొమాటో షేరు ధర 62 శాతం ఎగబాకి రూ.123.35 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సంస్థ షేర్లు ఓ దశలో రూ.138కు చేరి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్లను దాటింది. దీంతో బీఎస్‌ఈలో అత్యధిక విలువ కలిగిన తొలి 50 కంపెనీల సరసన చేరింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బీపీసీఎల్‌, శ్రీ సిమెంట్స్‌ను దాటేయడం విశేషం.

ఫుడ్‌ డెలివరీ రంగానికి చెందిన ఓ కంపెనీ ఐపీఓకి రావడం ఇదే తొలిసారి. అలాగే గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో పాజిటివ్‌ ట్రెండ్‌ నడుస్తుండడం జొమాటో శుభారంభానికి దోహదం చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి కంపెనీ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అవేవీ షేరు దూకుడును అడ్డుకోలేకపోయాయి. పెద్దగా లాభాలు లేకపోయినప్పటికీ.. పెట్టుబడుల్లో స్థిరత్వం కంపెనీపై సానుకూల ధోరణిని తీసుకొచ్చి పెట్టింది. గతంలో నష్టాల్లో ఉన్నప్పటికీ.. నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ప్రస్తుతం మంచి వృద్ధిని సాధిస్తున్న విషయాన్ని మదుపర్లు పరిగణనలోకి తీసుకున్నట్లున్నారు.  పైగా భవిష్యత్తులో ఇంటర్నెట్‌ ఆధారిత, ఫుడ్‌ డెలివరీ రంగానికి మంచి వృద్ధి ఉండనుందన్న అంచనాలు జొమాటో షేర్ల దూకుడుకు కారణమైనట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)