ఎస్. వి. రంగారావు

Telugu Lo Computer
0

 


ఎస్. వి. రంగారావు గా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుండి  నాటకాల్లో నటించేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనుకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో  సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు

ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన  లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశారు.  మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు,, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవారు. ఆయనకు వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగారు. ఈమె భర్త మరణానంతరం మనుమలు, మనుమరాళ్ళతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హైస్కూలు చదువు అక్కడే సాగింది. మద్రాసు హిందూ హైస్కూలులో తన పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో ఆయనలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. మద్రాసులో ఎస్. ఎస్. ఎల్. సి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి. ఎస్. సి కాకినాడలోని పి. ఆర్. కళాశాలలోనూ పూర్తి చేశారు. మద్రాసులో చదువులో అంతంతమాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ, విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరయితే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం.

నాటకరంగం 

ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల అతను బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలి పెట్టలేదు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. ఆయనకు ఇక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది.

నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలనుకున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే చొలెనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరులో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు.

తొలినాళ్ళు 

ఆయన  నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం సిగ్గేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో అతనుకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు.జంషెడ్పూర్ లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతను వేషాలు వేసేవారు. అదే సమయంలో అతను వివాహం కూడా జరిగింది.

పునఃప్రవేశం 

కొద్ది రోజుల తర్వాత బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఎ. వి. సుబ్బారావుకు ఇచ్చేశారు. బి. ఎ. సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్నపాత్ర దక్కింది. తర్వాత ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగారు.

అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి (1951) సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకిచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది.

పరభాషా సినిమాలు 

1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్ళి చేసి చూడు సినిమాను తమిళంలో కల్యాణం పణ్ణి పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నై, శారద, కర్పగం, నానుం ఒరుపెణ్ వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు గాంచారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు.

నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతను్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నది. నటి లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు.

ఎస్.వి.రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించారు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. "వేట", "ఆగష్టు 8", "పసుపు కుంకుమ", "ప్రాయశ్చిత్తం", "విడుదల", "సంక్రాంతికి", "సులోచన" అనే ఏడు కథలు మాత్రం లభ్యమౌతున్నాయి. ఇటీవల ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)