ఇది 'ఏడుతరాల' అనుబంధం

Telugu Lo Computer
0

 

ఏడు తరాలు తరతరాలు గుర్తుంచుకోవలసిన చరిత్ర, బాధామయ జీవితాల గాథ. చీకటిని చీల్చుకుని వెలుతురును జయించిన ఆఫ్రికనుల అనుభవాల జ్ఞాపకాలు. స్వేచ్ఛ , స్వాతంత్రాల కోసం అల్లాడిన కొన్ని తరాల జీవిత చరిత్ర. ప్రతీ దేశస్థుడూ, ప్రతీ వ్యక్తీ తెలుసుకోవలసిన చరిత్ర. కొన్ని పుస్తకాలు చదివితే మనసు ఆనందంతో పులకిస్తుంది. మరికొన్ని చదివితే బుద్ధి వికసిస్తుంది. కానీ కొన్ని పుస్తకాలు చదివితే కన్నీరు మున్నీరై ప్రవహిస్తుంది. మనసు, బుద్ధి ఆ ప్రవాహంలో కొట్టుకుని గిలగిలలాడుతాయి. అటువంటి పుస్తకమే ఏడుతరాలు. మానవ మృగాలకు బానిసలుగా చిక్కి నరకం అనుభవించిన ఆఫ్రికనుల జీవిత వ్యధ ఏడుతరాలు. చీకటి ఖండంలోంచి వెలుగులోకి వచ్చినా తమ బతుకుల్లో చీకటిని దూరం చేసుకోలేపోయిన దురదృష్టవంతుల జీవితం.
ఈ పుస్తకం గురించి చెప్పుకునే ముందు దీని రచయితల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎలెక్స్ హేలీ…అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికన్. ఈతని తాత ముత్తాతల కథే రూట్స్. తన అమ్మమ్మ నోటి నుంచి వినిన కథను ఆధారంగా చేసుకుని, తన పూర్వీకుల చరిత్రను పరిశోధించి రాసిన పుస్తకం రూట్స్. తనవారి చరిత్ర గురించి తను తెలుసుకోవడమే కాకుండా ప్రపంచానికి తెలియజేసాడు అలెక్స్ హేలీ. నాగరికత అంటూ విర్రవీగే అమెరికన్ల పునాదులు ఎంత రాక్షసత్వమైనవో తెలియజెప్పి ప్రతీ అమెరికన్ తలదించుకునేలా చేసాడు. ఈ పుస్తకం రాసి తన జాతి బానిసత్వపు రుణాన్ని తీర్చుకున్నాడు అలెక్స్. రూట్స్ ను ఏడుతరాలుగా అద్భుతంగా తెలుగులో అనువదించిన రచయిత సహవాసి(జంపాల ఉమామహేశ్వర్రావు). ఎక్కడా ఒక అనువాద పుస్తకం చదువుతున్నామనే భావన తీసుకురాదు ఈయన రచన. సరళమైన తెలుగులో ఉండే ఏడు తరాలపుస్తకంలో ఉండే వ్యక్తుల పేర్లు, స్థలాల పేర్ల బట్టి అనువాద పుస్తకమని గుర్తించాలి గాని రచనను బట్టి కాదని నాకు అనిపిస్తుంది. దీని తరువాత చాలా అనువాద పుస్తకాలు చదివాను కానీ సహవాసి రాసిన అంత బాగా మరెవరూ రాయలేదనిపించింది. ఏడుతరాలు పుస్తకం తెలుగులో కూడా పేరు సంపాదించడానికి ఇది ఒక ముఖ్య కారణం అనే చెప్పుకోవాలి.
ఏడుతరాలు ముఖ్యంగా బానిసల కథ. జాలి, దయ తెలియని అమెరికన్ల దుష్ట స్వభావానికి పరాకాష్ట . తమ దేశంలో, తమ పల్లెల్లో హాయిగా స్వేచ్ఛగా తమదైన సంప్రదాయాలతో ఆడుతూ పాడుతూ జీవించే ఆఫ్రికన్లను జంతువులను వేటాడినట్టు వేటాడి, చీకటి ఓడలలో రోజుల తరబడి బందీలుగా ఉంచి తమ దేశానికి తీసుకువచ్చి బానిసలు చేసుకున్న అమెరికన్ల కథ ఇది. ఈ కథలో తరాలకి ఆద్యుడు కుంటా కింటే. క్రీస్తుశకం 1750లో బింటా, ఉమరో లకు మొదటి బిడ్డ కుంటాతో మొదలవుతుంది ఈ కథ. ఆఫ్రికనుల సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి యవ్వనం వచ్చే దాకా పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచుతారు వాళ్ళు. అన్నిటికన్నా మగపిల్లలకు పురుషత్వం కోసం ఇచ్చే శిక్షణ చాలా వింతగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ చాలా వివరంగా రూట్స్ లో వివరించాడు అలెక్స్ హేలీ. కుంటా పుట్టిన నాటి నుంచి అతను యవ్వనంలోకి అడుగుపెట్టేంత వరకు అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆ తరువాతే మొదలవుతుంది అసలైన కథ. ఓ రోజు పొలం కాపలాకు వెళ్ళి తిరిగి వస్తున్న కుంటాని దొంగతనంగా ఎత్తుకు వచ్చేస్తారు అమెరికన్లు. అక్కడ మొదలవుతుంది ఏడుతరాల ఆఫ్రికన్ల అంతులేని బానిసత్వం. ఆఫ్రికా నుంచి బానిసలను అమెరికాకు తరలించడానికి అమెరికన్లు ఓడలను ఉపయోగించేవారు. వందల చొప్పున బానిసలను తీసుకురావడం అమెరికాలో అమ్మేయడం ఇదీ తంతు. ఇలా కుంటా కూడా ఓ ఓడలో కొన్ని రోజుల పాటు ప్రయాణిస్తాడు. రచయిత ఈ ఓడ ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు. నిజంగా మనమే ప్రయాణిస్తున్నామా అన్నట్టు ఉంటుంది. నిజంగా బానిసల ఓడ ప్రయాణం భయంకరం. దాని కంటే చచ్చిపోవడం మేలు. ఎక్కడో ఓడ అడుగు భాగంలో గాలీ వెలుతురు లేని ప్రదేశంలో కట్టి పడేసేవారు. అక్కడే కూర్చున్నచోటనే మలమూత్రాదులు కూడా చేసుకోవాలి. ఎప్పుడో తెల్లతొక్కకి బుద్దిపుట్టినప్పుడు వచ్చి శుభ్రం చేస్తాడు లేదంటే అదీ ఉండదు. బానిస ఏమైనా అన్నాడో వాడు తోలు ఊడవలసిందే. ఇలా నానారకాల చిత్రహింసలు పెట్టేవారు. ఇన్ని బాధలు పడలేక కొంత మంది అక్కడే చనిపోయేవారు. మిగిలిన వారిని అమ్మేసేవారు. ఇలా అమెరికా తీసుకురాబడ్డ కుంటాను ఓ తెల్లదొరకు అమ్మేస్తారు.
కుంటా బలవంతంగా నిగ్గరు బతుకు బతుకుతాడు కానీ ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కుంటాకి తన జాతి, సంప్రదాయాల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. చావడానికైనా సిద్దపడతాడు కానీ వాటిని భంగపరచడానికి ఏ మాత్రం ఇష్టపడడు. పారిపోవడానికి కుంటా చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కాలు కూడా పోగొట్టుకుంటాడు. ఇక విధిలేక అక్కడే ఉన్న ఓ నిగ్గరు స్త్రీ బెల్ ని పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత అతనికి కిజ్జీ అనే కూతురు పుడుతుంది. కుంటా తన కూతురును ఆఫ్రికన్ సంప్రదాయాల ప్రకారమే పెంచుతాడు. తన కథ మొత్తం అంతా చెబుతాడు. అంతే కాదు రాబోయే తరాలకి కూడా ఈ కథ అంతా చెప్పాలని చెబుతాడు.
ఆ తరువాత కిజ్జీ, సంతానం వారు పడ్డ బాధలు అన్నీ ఉంటాయి. కానీ కుంటా కథ మాత్రం పరంపరాగతంగా అన్ని తరాలకు చెప్పబడుతూ ఉంటుంది. అలా ఏడోవ తరం అయిన అలెక్సి హేలీకి కూడా ఈ కథ తెలుస్తుంది. అక్కడి నుంచి అతను చాలా పరిశోధనలు చేసి మొత్తం చరిత్రనంతటినీ సమకూర్చుకుని రూట్స్ నవల రాయడం తరువాతి కథ.

జపూరు నాగరికత, తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే తపన, తన సంస్కృతీ సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం నవల చదువుతున్నంతసేపూ మనల్ని వెంటాడతాయి. నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే బాధలు, ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా ప్రయత్నాలు కంటతడిపెట్టిస్తాయి. ఆఫ్రికన్ల కష్టం తింటూ, వారి తల్లుల పాలే తమ పిల్లలకు తాగిస్తూ తెల్లవారు చేసిన దమనకాండ ఛీ అనిపించకమానదు. నాగరికతను అభివృద్ధి చేశామని చెప్పుకునే అమెరికా చేసిన అనాగరిక చర్యలకు ప్రత్యక్ష సాక్ష్యం ఏడుతరాలు.

Post a Comment

0Comments

Post a Comment (0)