ఆహార సంక్షోభంపై కిమ్ ఆందోళన !

Telugu Lo Computer
0


ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నుంచి బయటపడేందుకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను కనుగొనాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరికొంతకాలం పొడిగిస్తున్నందున వాటికి సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు.

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంటున్న ఉత్తర కొరియా, దేశ సరిహద్దులను మూసివేయడంతో పాటు కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. ముఖ్యంగా చైనాతోనూ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించింది. దీంతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించినట్లు సమాచారం. అంతేకాకుండా గత వేసవికాలంలో అక్కడ సంభవించిన తుపానులు, వరదలతో పంటలు నాశనం కావడంతో ఉత్తరకొరియా ఉక్కిరిబిక్కిరైంది. ఇలా వరుస ప్రభావాలతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కోనుందని దక్షిణ కొరియా థింక్‌ట్యాంక్‌ కొరియా డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈమధ్యే వెల్లడించింది. దీంతో దేశ ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక, ఆహార పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తాజాగా ప్రారంభమైన పార్టీ ప్లీనరీ సమావేశంలో అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొనడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను కనిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఆహార కొరత, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలను మరికొంత కాలం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రజలకు కిమ్‌ సూచించారు. వీటితో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపై ఉత్తరకొరియా ఎలా స్పందించాలనే విషయాన్ని అధికారులతో చర్చించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎంఏ  వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)