ఆహా !! ఏమి రుచి !!

Telugu Lo Computer
0

నా చిన్నతనం అంటే షుమారు 50 సంవత్సరాలు వెనక్కి వెడితే ---
ఆ రోజుల్లో గ్యాస్ లేదు .
వంటంతా కుంపటి , పొట్టు పొయ్యి , కట్టెల మీదే చేసేవారు .
వేడి నీళ్ళకు గీజర్ లు ఉండేవి కావు.
దొడ్లో వెనుక వైపు ఇటుకలు పేర్చి దాని మీద డేగిశా పెట్టి
కొబ్బరి డొప్పలు , కొబ్బరి మట్టలు వేసి పొయ్యి రాజేసి స్నానానికి నీళ్ళు కాచుకునేవారు .
చాలా గ్రామాలకు కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదు .
సాయంత్రం నాలుగు అయ్యేసరికి లాంతరు , చిమ్నీలకు ముందు రోజు పట్టిన మసి ముగ్గుతో శుభ్రంగా తుడిచి , వత్తులు సరి చేసి , వాటి నిండా కిరోసిన్ పోసి చీకటి పడక ముందే వెలిగించటానికి సిద్ధం చేసుకునేవారు .
మాకు ఊహ తెలిసే నాటికి కరెంటు ఉన్నా రాత్రి పూట ప్రైవేటుకు వెళ్ళే సమయంలో లాంతరులు పట్టుకు వెళ్ళి అక్కడ వెలిగించి ఆ వెలుగులోనే చదువు కునే వాళ్ళం.
వేసవి కాలం పరీక్షల సమయంలో మేడ మీదకు వెళ్ళి చదువుకోవాలనుకునే సమయంలో మేడ మీద కరెంటు ఉండేది కాదు .
లాంతరు వెలిగించి మేడ మీదకు పట్టుకు వెళ్ళి ఆ దీపపు వెలుగులోనే చదువుకునే వాళ్ళం.
ఈ రోజుల్లో AC లు , గది గదికి ఫానులు , కరెంటు పోతే Invertor లు .
ఈ సదుపాయాలు ఆ రోజుల్లో ఎక్కడవి ?
శివరాత్రికి ముందే డాబా మీదకు వెళ్ళి పడుకునే వాళ్ళం.
దాదాపుగా దసరా వరకు మేడ మీదే పడకలు .
ఇప్పటిలా ఒకరి మీద ఒకరు పడి పోతున్నట్లు ఆనించేసి ఇళ్ళు కట్టే వారు కాదు.
అపార్ట్ మెంట్ కల్చర్ ఆ రోజుల్లో లేదు .
దాదాపుగా అన్నీ పెంకుటిళ్ళు .
మండువా లోగిలి ఇళ్ళు .
అక్కడక్కడ కలిగిన వాళ్ళకు మాత్రమే ఉండే డాబాలు , రెండతస్థుల మేడలు .
ఇక మేడ మీదకు వెళ్ళి చాప దిండు వేసుకుని పడుకుంటే ప్రాణం ఎటు పోయేదో ?
ప్రతి ఇళ్ళల్లోనూ చుట్టూరా కొబ్బరి చెట్లు , అరటి చెట్లు ,రకరకాల పూలు మరియు పళ్ళ చెట్లు ఉండేవి .
వాడుకున్న నీళ్ళన్నీ మొక్కల లోకి వదిలేవారు.
మొక్కలన్నీ ఆ వాడిన నీరు పీల్చుకుని , మరి ప్రత్యేకంగా నీరు పోయవలసిన అవసరం లేకుండా ఏపుగా ఎదిగేవి .
మురుగు లేదు కాబట్టి దోమలు ఉండేవి కావు.
ఇంక ఆ చెట్ల నుండి వీచే కమ్మని గాలికి నిద్రపోతున్న ప్రాణం ఎటు పోయేదో , ఉదయాన సూర్య భగ వానుడు తన వేడి వాడి కిరణాలతో చుర్రు చుర్రు మని పించే దాకా మెలుకువ వచ్చేది కాదు .
ఈ రోజుల్లో దోమలకు , వాటి వల్ల వచ్చే రోగాలకు భయపడి , కిటికీలన్నీ తలుపులతో సహా మూసుకుని , Jet లు , All Out లు వెలిగించి ,ఫాన్ మరియు AC కూడా వేసుకుని ఆ పొగ మరియు ఈ AC తో ఉక్కిరిబిక్కిరై ముక్కులు మూసుకు పోయి , ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ కాలుష్యాల గాలులు పీల్చడం వలన , తల అంతా పట్టుకు పోయి ఉదయాన్నే ఏ బకరా దొరుకుతాడా ఎవడి మీద విరుచుకుపోదామా ? అనే రీతిన చికాకుగా తయారవుతున్నాము.
ఇంక భోజనాల విషయం .
కలిగిన వాళ్ళిళ్ళల్లోనే ఉదయాన కాఫీలు , టిఫిన్లు .
అదీ ఇంటి యజమాని యజమానురాలు మాత్రమే తీసుకునే వారు .
మిగిలిన వాళ్ళందరికీ రాత్రి మిగిలిన చద్దన్నాలు , తర్వాణి అన్నాలే .
అమ్మమ్మ కాని , బామ్మ కాని వేసవి శలవులకు వచ్చిన పిల్లలందరినీ తమ చుట్టూ కూర్చో పెట్టుకుని , మధ్యలో పెద్ద కంచం పెట్టుకుని ఆ చద్దన్నంలో కొత్తగా పెట్టిన కొత్తావకాయ బాగా నెయ్యి వేసి కలిపి ముద్దలు పెట్టేవారు .
తర్వాత రాత్రి మిగిలిన చారు కాని పులుసు కానీ రాచిప్ప లోనుండి తీసి చద్దన్నం లో కలిపి అందరికీ ముద్దలు పెట్టేవారు .
అప్పుడు దాదాపు అందరిళ్ళల్లో ఆవు ఉండేది .
అందరికీ సరిపడేలా శేరున్నర , రెండు శేర్లు పాలు ఇచ్చేది .
వంటంతా అయిపోయాక బొగ్గుల మంట బాగా తగ్గాక మట్టి కుండలో పాలు పోసి సన్నని మంటన ఎర్రగా దళసరిగా తొరక కట్టేలా పాలు కాచి , పళ్ళెంలో నీళ్ళు పోసి బాగా కాచిన పాలకుండ అందులో పెట్టి , పాలు తోడు వేయటానికి అనువుగా ఉన్న వేడిలో పెరుగు బిళ్ళ అందులో వేసి తోడు పెట్టేవారు .
ఉదయాని కల్లా ఆ పెరుగు గట్టిగా జున్ను ముక్కలా తోడు కునేది .
ఉదయాన్నే ఒక పొడవాటి కర్రకు పెరుగు చిలికే కవ్వం కట్టి కొద్ది నీళ్ళు పోసి కవ్వంతో వెన్న చిలికే వారు .
దాదాపుగా సవాశేరు అంటే 350 గ్రాముల వెన్న వచ్చేది .
ఆ వెన్న గట్టిగా గుండ్రంగా పెద్ద ముద్దలా చేసి , ఆ మజ్జిగ కుండలోనే వేసే వారు .
మధ్యాహ్నము దాకా ఆ వెన్న మజ్జిగలోనే తేలుతుండేది .
అలా కుండలో చేసిన మజ్జిగతో కాని , లేదా మీగడ పెరుగు వేసి కాని చద్దన్నంలో ముద్దలు కలిపి , ఆవకాయ కలిపిన ముక్కలు కంచం అంచులతో తుంపి చిన్న చిన్న ముక్కలుగా చేసి మీగడ పెరుగు అన్నం ముద్దలో పైన నంచు కోవడానికి పెట్టి , అందరికీ పెట్టే వారు .
ఆహా !! ఏమి రుచి .

Post a Comment

0Comments

Post a Comment (0)