ఓరయ్యో వానదేవుడా,
ఓరంగా పోరయ్యో!
ఒదలకుండా గురిసి
వెడదగా ఉదరేవూ!
ఏమి సోద్దెమోరే,
ఇనుకోవు మా గోడు!
పేదగుడిసెలోళ్ళం
పలవరింపజేకరయ్యో!
।।ఓరయ్యో।।
ఒంటితుమ్మసేనంటా
ఒరసమే లేదంటా!
ఇడ్డూరాలేంటో జూప
ఇరిగణంతో ఉరలేవు!
ఇల్లంతాగురిసేవు
ఒళ్ళంతా తడిపేవూ?
।।ఓరయ్యో।।
సంటిపాపడకేమో
సలపరం సేసినాది,
సలిసలిగా ఇల్లంతా
సెమ్మసెమ్మైపోనాది!
మొఱబెట్టేటంతలో
మెఱపులుఱుములైనాది!
సయాన నీబోంట్లకు
సరసమిదేటోరయ్యో?
।।ఓరయ్యో।।
పొలంపుట్టాగురిసి
సెట్టూమిట్టాదాటీ,
సక్కంగా సెరువుల్నిండా
సల్లంగ కురియరయ్య!
మళ్ళూతోటల్లోన
ముమ్మురంగ కురీకుండ,
మా గుడిసెల్నిండేల
మడిసేసిపోనావు!
।।ఓరయ్యో।।
::::::::
వెడదగా ఉదరడం: విశాలంగా అదురడం (ఉఱుములు మెఱుపుల్తో);
ఇరిగణం: వడిగాలి; ఉరలడం: కాఱడం