పరిశోధన - ప్రయోగం

Telugu Lo Computer
0



గడచిన రెండు శతాబ్దాలలో శాస్త్రవిజ్ఞానం గొప్పగా పురోగమించింది. ఊహించలేని అద్భుతాలను ఆవిష్కరించింది. ఒక టెలివిజన్, మొబైల్ ఫోన్ , కంప్యూటర్, విమానం, ప్రింటింగ్ ఇవన్నీ మన పూర్వీకులు ఊహించడం అసాధ్యం.

మానవుని నాగరికతలో భాగంగా వేలాది ఏళ్ళుగా తనకు ఎదురయ్యే కష్టాలకు, రుగ్మతలకు తన చుట్టూ ఉన్న... చిన్న ప్రపంచంలోనే పరిష్కారాలను వెదికే ప్రయత్నం చేసాడు. ఆయా నాగరికతల్లో, వారి ప్రాంతాలలో దొరికే మొక్కలను, మూలికలను, జంతువులను, మన్నునూ ఉపశమనాని (వైద్యాని)కి వినియోగించడం మొదలైంది. వాటిలో ఏముందీ తెలియదు, అయినా మొక్కల/ చెట్ల భాగాలతోనో, మరో దానితోనో ఉపశమనం కలిగినపుడు... తర్వాతి కాలంలో వాటిని తిరిగి తిరిగి వాడుకున్నారు. అనగా అనుభవం, పరిశీలనలతో సంప్రాదాయ వైద్య విధానాలు స్థిరపడ్డాయి. లిపి ఉన్న సమూహాలు తమ సంచిత జ్ఞానాన్ని(accumulated knowledge) గ్రంధస్తం చేసుకున్నాయి. అలా పెర్షియన్ సమాజం యునానీ, భారతీయ సమాజం ఆయుర్వేదం ( దక్షిణ భారతంలో సిద్ధ), టిబెటన్ సోరిగ్, చైనీస్, ఆఫ్రికన్ సంప్రదాయ వైద్య విధానాలు ఆయా దేశ, ప్రాంతాలలో స్థానిక వైద్య విధానాలుగా స్థిరపడ్డాయి.
ఆధునిక వైద్యం ఎలా పని చేస్తుంది? అసలు MBBS లో ఏమి నేర్చుకుంటారు అనేది తెలియకుండా... మోడరన్ మెడిసిన్ తో... (సంప్రదాయ) ఆయుర్వేదవైద్యం పేరుతో ఇచ్చే ఔషధాలను పోల్చే ప్రయత్నం అర్ధం లేనిది.
మొదటి ఏడాది MBBS లో, ఎనాటమీ అంటే శరీర నిర్మాణం గూర్చి తెలుసుకుంటారు. అనగా పైకి కనిపించే కళ్ళు, ముక్కు, చేతులు, మూతి వంకరలూ, వెడల్పూ, పొడవూ అనుకొనేరు. చాలా నిశితంగా, కళ్ళకి కనిపించని... అతి పెద్ద లేబొరేటరీల్లో, అత్యాధునిక విజ్ఞాన ఉపకరణాలతో గమనించే అనేక విషయాలను.... ఎంతో వివరంగా తెలుసుకుంటారు. ఉదాహరణకు రక్త ప్రసరణ వ్యవస్థలో.... గుండె నుండి శరీరానికి రక్తాన్ని తీసుకొని పోయే పెద్ద ధమనులూ, చిన్న ధమనులు, ఇంకా చిన్నవి – ఆర్టిరియోల్స్ – తదుపరి కేపిల్లరీస్....తర్వాత మళ్ళీ గుండె వైపుకు రక్తాన్ని తీసుకెళ్ళే వీనస్ సిస్టం. ప్రతి అవయవమూ, అంతర్గత అవయవాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఇక ఫస్టియర్ లోనే చదివే ఫిజియాలజీ, రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె సంకోచ వ్యాకోచాలు, రక్తాన్ని పంపిణీ చేసే విధానం, గుండె సంకోచానికి వ్యాకోచానికి సంబంధించి ఎలక్ట్రిక్ కండక్షన్, దాన్ని గుర్తించే ఇసిజీ వంటి వాటిని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఇక రక్తపోటును ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయి.... అనగా బిపి = కార్డియాక్ అవుట్ పుట్ X రక్త నాళాల నిరోధకత (పెరిఫరల్ రెసిస్టెన్స్). వీటిలో శరీరంలో వుండే ద్రవం యొక్క పరిమాణం మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఒక పరిమితి లో ఉంటేటట్టు చూసే కిడ్నీలు – వాటి పని తీరుని నియత్రించే మెదడు – వివిధ రకాల రసాయనాలు.... వీటన్నిటి గురించి తెలుసుకుంటారు. ఇక పోతే బయోకెమిస్ట్రీలో శరీరంలోని వివిధ జీవన క్రియలు, రసాయనాలు – వాటి ఉత్పత్తి .....ఒక అవయవ పనితీరుని తెలుసుకోవడానికి ఏ రసాయనాన్ని చూడాలి....ఇత్యాది విషయాలు. తదుపరి చదివే ఫార్మకాలజీ అనబడే ఔషధశాస్త్రంలో ముందు తెలుసుకున్న ఫిజియాలజికల్ విషయాల్లో ఎక్కడ ఏమి మార్చి పాడైన/గతి తప్పిన శరీరధర్మాల్ని దారిలో పెట్టవచ్చును అనేది... కొన్ని వేలరకాల మందులను గురించి తెలుసుకుంటారు. పేథాలజీలో వివిధ రుగ్మతలలో శరీరంలో ఏ మార్పులు వస్తాయి, ఎలా గుర్తించాలి అనేవి చదువుతారు. చివరి సంవత్సరంలో మెడిసిన్, సర్జరీలలో అప్పటివరకూ చదివిన విషయాలను క్రోడీకరించి... ఏ ఏ జబ్బులలో ఏ మార్పులూ, ఏ లక్షణాలు – కాలవ్యవధి – ఏ పరీక్షలు చేసి తేల్చాలి – ఏ వైద్యం చేయాలి అనేది మొత్తంగా ఉంటుంది.
అంటే MBBS లో మొదటి ఏడాది నుండి చివరి ఏడాది వరకూ ప్రతీదీ ఒకదానికొకటి అనుసంధానమై ఉండి.... ఎంతో నిశితంగా నేర్చుకొని.... పాసైతే డాక్టరీ చేతికి వస్తుంది. అత్యంత ప్రతిభావంతులు కూడా కష్టించి చదవాల్సిన కోర్స్ MBBS. ఇందులో వాడే మందులు డాక్టర్లు కూడా.... ఏనాడూ చూడనంతటి అతి సూక్ష్మమైన శరీర అంగాలలో పనిచేసే రసాయన అణువులు.
అయితే కొన్ని సంప్రదాయ వైద్యాల మూలికలు/వృక్ష భాగాలలో శరీర రుగ్మతలను ఉపశమింప చేయగల రసాయనాలను తర్వాతి కాలం లో ఆధునిక వైద్య శాస్త్రం గుర్తించింది. నొప్పి నివారణ కు వందల ఏళ్ళు గా వినియోగించిన ....చెట్టు బెరడు లో శాలిసిలిన్, శాలిసిలిక్ ఆసిడ్స్ ని గుర్తించారు.దానిని ప్రయోగశాలలో వేరు చేసి, మెరుగుపరచి అసిటైల్ శాలిసిలిక్ ఆసిడ్ గా రూపొందించారు... అదే ఆస్పిరిన్ గా ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్నారు.
అలాగే శతాబ్దాలుగా డ్రాప్సీ అనబడే కాళ్ళవాపు (ఎడిమా)కి వాడిన ఫాక్స్ గ్లోవ్ (డిజిటాలిస్ లెనేటా )...మొక్క నుండి వేరుచేసిన ఆల్కలాయిడ్స్ అయిన 'డిజాక్సిన్' ప్రధానంగా కాళ్ళ ఎడిమా ఉండే గుండె ఫెయిల్యూర్ లో ఇప్పటికీ విస్తృతంగా వాడబడుతున్న ఔషధం. సింకోనా చెట్టు బెరడు నుండి తీసిన ఆల్కలాయిడ్ 'క్వినైన్' ను మలేరియా చికిత్సలో విశేషంగా వాడుతున్నారు. ఇక సర్పగంధి గా పిలవబడే రావుల్ఫియా మొక్క నుండి తీసిన రిసర్పైన్ ను మానసిక జబ్బులలో, రక్త పోటులో దీర్ఘకాలంగా వాడుతున్నారు.
ఇలా, కొన్ని పుంజీల మందులు సంప్రదాయ వైద్యాలలో వాడిన చెట్ల నుండి తీసారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించి ఆ మూలికల/చెట్ల నుండి తీసిన క్రియాశీల అణువులను మోడరన్ మెడిసిన్ లో ప్రవేశ పెట్టారు.... ఆయా సంప్రదాయ వైద్యాలలో ఏ జబ్బులకు విరివిగా వాడుతుండినారో...వాటిలో వాడుతున్నారు. ఇలా సంప్రదాయ వైద్యాల నుండి ఆధునిక వైద్యం లో ప్రవేశ పెట్టబడ్డ మందులు బహుతక్కువ. ఆధునిక విజ్ఞానానికి సంకుచితత్వం ఉండదు. నిజంగా గొప్పగా పని చేస్తున్న ఔషధాలను... వివిధానేక రకాలుగా పరిశోధించి... వాటిలోని క్రియాశీల సారాన్ని వేరు చేసి... తదుపరి ఆ తరహా అనేక మందులను.... ప్రయోగశాలలో తయారుచేసే విధానాలను అభివృద్ధి పరచారు.
అనగా సంప్రదాయ, దేశీయ వైద్యాలలో కేవలం పరిశీలన అనుభవాలతో వివిధానేక మొక్కలు, జంతువులు, మన్నులను వాడుతూంటే.... ఆధునిక వైద్యంలో వీటిలో గొప్పగా పని చేస్తున్న కొన్నిటిని ప్రయోగాలు, పరిశోధనలతో నిగ్గుతేల్చి... మానవుల రుగ్మతలను ఎదుర్కోవడానికి వాడుతున్నారు. నాగరికతల వికాసంలో కొన్ని దశలలో వినియోగంలోకి వచ్చినవి సంప్రదాయ వైద్యవిధానాలు. శాస్త్రీయ విజ్ఞానం గొప్ప పురోగతి సాధించాక జబ్బులను కణాలు, కణాంగాలు, అణువుల స్థాయి లో అర్ధం చేసుకోవడం మొదలైంది. వాటికి పరిష్కారాలు వెతికి మానవాళికి అందించారు. కేవలం ప్రాంతీయ, చారిత్రక, వారసత్వ అభిమానాలతో మాత్రమే ఆయా దేశాలు/ప్రాంతాలలో వివిధ సంప్రదాయ వైద్య విధానాలు నిలబడ్డాయి. అయితే ఆధునిక వైద్యం మాత్రం ప్రపంచం అంతటా ఒకే విధంగా ఉంటుంది. ఋజువైన, సమర్ధవంతమైన ఆధునిక వైద్యానికి దేశీయ వైద్యముతో పోటీ గానీ, పోలిక గానీ ఉండదు.
సంప్రదాయ వైద్యాలకు చిన్న రుగ్మతల చికిత్సలో కొంత స్థానం ఎప్పటికీ ఉండొచ్చు. దాదాపుగా సంప్రదాయ వైద్యులు అందరూ పెద్దగా వనరులను ఉపయోగించకుండానే... చిన్న నలతలకు తమవైన ఔషధాలను ఇస్తూ ఉంటారు. అయితే ఆధునిక వైద్యం రోగ నిర్ణయం విషయంలో.... శాస్త్రీయ విజ్ఞానాన్ని విశేషంగా వినియోగించుకొని గొప్ప ప్రగతిని సాధించి... అనేక రకాల పరీక్షలు ఎమ్మారై, సిటీ స్కాన్, వివిధానేక రక్త పరీక్షలను అందించింది....అది కాస్తా... చికిత్స కన్నా ప్రధానం అయ్యింది... కొందరు వైద్యులకు పెద్ద ఆదాయ వనరుగా.... పేషంట్లకు గుదిబండగా మారడంతో... జనంలో కొంత వ్యతిరేకత మొదలైంది.
ఆఫ్రికన్ తెగల గిరిజనులు తమ సంప్రదాయం పేరుతో పులి చర్మాలు, జంతువుల తోళ్ళూ కప్పుకొని ఈటెలతో జీవిస్తూంటే మనకి చూడడానికి ముచ్చట వేస్తుంది. అంతేతప్ప మనం చక్కటి దుస్తుల్ని వదిలి వాళ్ళలా మారడం జరగదు. దేశీయ వైద్య విధానాలు కూడా... మానవజాతి వేల, లక్షల ఏళ్ల ప్రయాణంలో ఒకానొక చారిత్రక దశ లోనివి. ఆధునిక వైద్యం సార్వజనీనం...పురోగామి విధానం. ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ మానవాళికి మేలు చేస్తుంది. ఆధునిక వైద్యం లో వ్యాపారం, దోపిడీ వెర్రితలలు వేసినంత మాత్రాన... దేశీయ వైద్య విధానాలు ఆధునిక వైద్యానికి సాటి రావు/రాలేవు. అయితే ఇంకా దేశీయ వైద్యాలలో మంచి ఫలితాలను ఇచ్చే ఔషధాలను గుర్తించి, వాటిలో ఏ రసాయన అణువు రుగ్మత నుండి ఉపశమనం కలిగిస్తున్నదీ తెలుసుకొని, ఆధునిక వైద్యంలో ప్రవేశపెట్టాలి... అప్పుడు ఆ సంప్రదాయ వైద్యం కాస్తా ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా...సార్వజనీనం అవుతుంది. ...
ఉపసంహారం : శరీరానికి ఏమి ఇచ్చినా... అది అతి చిన్న రసాయన అణువులుగా విడగొట్టుకొని మాత్రమే రక్తంలోకి శోషణం చేసుకుంటుంది.... రసాయనాలు కానివి ఏవీ ప్రకృతిలో వుండవు.... భౌతిక రూపంలో కనిపించేది.... వివిధానేక రసాయనాలే.... మానవుడు విరేచనంగా విసర్జించేది... తాను చిన్న రసాయన అణువులుగా విడగొట్టలేని పీచు వంటివి, ఇంకా బాక్టీరియా తదితరాలు. అలాగే ప్రకృతిలోని ప్రతిదీ మనిషికి హితమైనది కాదు... పూల పుప్పొడులు తీవ్రమైన అలెర్జీ కలుగచ్చేస్తాయి... అనేక విష ఫలాలు కూడా ప్రకృతిలోనే వున్నాయి. 
                                                    -డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, కాకినాడ.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)