ఫిలిప్పీన్స్‌ సార్వభౌమత్వానికి మద్దతు ఇస్తాం !

Telugu Lo Computer
0


ఫిలిప్పీన్స్‌ సార్వభౌమత్వానికి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌  తెలిపారు. రక్షణ, భద్రత సహా నూతన రంగాల్లో మనీలాతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆ దేశ పర్యటనలో ఉన్న జైశంకర్‌ అక్కడి విదేశాంగ మంత్రి ఎన్‌రిక్‌ మనాలోతో సమావేశం అనంతరం మాట్లాడారు. సముద్ర చట్టాలను అన్ని దేశాలు పాటించాలని పేర్కొన్నారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ ఆధిపత్యం, ఫిలిప్పీన్స్‌తో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుత పరిణామాల నడుమ ఫిలిప్పీన్స్‌తో రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు భారత్‌ చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నకు జైశంకర్‌ బదులిస్తూ.. ''ఈ అంశాన్ని వేరుగా చూడాలి. సంబంధిత పరిస్థితులతో దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు'' అని చెప్పారు. ఇరు ప్రజాస్వామ్య దేశాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాయని, మారుతోన్న ప్రపంచంలో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం చాలా అవసరమని తెలిపారు. ప్రతి దేశానికి దాని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉందని చెప్పారు. దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. ఈ ప్రాంతాన్ని బీజింగ్‌ తనదని చెబుతోంది. ఈ క్రమంలోనే పెట్రోలింగ్‌ కోసం వందలాది కోస్ట్‌గార్డ్‌ నౌకలను మోహరించింది. అయితే.. ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్‌ తదితర దేశాలు డ్రాగన్‌ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొంతకాలంగా ఫిలిప్పీన్స్‌- చైనా మధ్య వివాదం తీవ్రమైంది. ఇటీవల ఇరుదేశాల కోస్ట్‌గార్డ్‌ నౌకలు ఢీకొన్నాయి. మనీలాకు చెందిన ఓ సరకు రవాణా పడవపై చైనా నౌకలు జల ఫిరంగులను ప్రయోగించాయి. ఫిలిప్పీన్స్‌ విషయంలో జైశంకర్‌ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. దక్షిణ చైనా సముద్రంపై తమ సార్వభౌమాధికార వాదనలను గౌరవించాలని భారత్‌ను కోరింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో మూడో దేశం జోక్యం తగదని విదేశాంగశాఖ ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు. ''సముద్ర వివాదాల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలి. మా సార్వభౌమత్వం, సముద్ర ప్రయోజనాలను గౌరవించాలి. ఇక్కడ శాంతి, స్థిరత్వం స్థాపనకు ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించాలి'' అని లిన్‌ జియాన్‌ వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)