రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడులో నిందితుడి కోసం ఏఐ టెక్నాలజీ ?

Telugu Lo Computer
0


బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. పేలుడుకు ముందు టోకెన్‌ కౌంటర్‌ దగ్గర రవ్వ ఇడ్లీ ఆర్డర్‌ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. వెళ్లిపోయే ముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్‌వాష్‌ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్‌ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని డీజీపీ చెప్పారు. మరోవైపు పది సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పేలుడు జరిగిందని రామేశ్వరం కేఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దివ్య తెలిపారు. బయట నుంచి వచ్చిన వ్యక్తి బ్యాగు తీసుకొచ్చి లోపల పెట్టారని తెలిపారు. కస్టమర్లు వాష్‌ బేసిన్‌కు వెళ్లేచోట 12.55గంటలకు పేలుడు జరిగిందని, ఆ బ్యాగు విషయంలో తమకు అనుమానం ఉందన్నారు. గతంలోనూ రెండుసార్లు తమ కేఫ్‌లో అనుమానాస్పద బ్యాగులను గుర్తించామని, ఒక బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దివ్య వివరించారు. రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతామన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)