అల్‌ ఖైదా యెమెన్‌ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతి !

Telugu Lo Computer
0

అల్‌-ఖైదా యెమెన్‌ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతి చెందినట్లు మిలిటెంట్ గ్రూప్‌ ప్రకటించింది. ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అల్‌-ఖైదా జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపుతూ ఆదివారం ఓ వీడియో విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఖలీద్‌ తలపై అమెరికా గతంలో దాదాపు రూ.40 కోట్ల రివార్డు ప్రకటించింది. అల్‌ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా యెమెన్‌ శాఖ అవతరించినట్లు చెబుతుంటారు. ఇకపై సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఉగ్రసంస్థ తాజా వీడియోలో వెల్లడించింది. పలుసార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చిన కారణంతో అక్కడి ప్రభుత్వం ఇతడిపైనా దాదాపు రూ.50 కోట్ల రివార్డు ప్రకటించింది. అమెరికాలో ఓ వాణిజ్య విమానాన్ని పేల్చివేసేందుకు అల్‌ ఖైదా యెమెన్‌ శాఖ 2009లో విఫలయత్నం చేసింది. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన దాడులు తమ పనే అని ప్రకటించింది. అప్పటి నుంచి అమెరికా ఈ గ్రూప్‌ను అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తూ వస్తోంది. 2020లో అమెరికా డ్రోన్‌ దాడిలో ఈ ఉగ్రసంస్థ నాయకుడు ఖాసీం అల్‌-రిమీ హతమయ్యాడు. అతడి నాయకత్వంలోనే సౌదీలోని అమెరికా నావికాస్థావరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్‌ సైనికులు మరణించారు. అతడి మృతి తర్వాత ఖలీద్ అల్-బటర్ఫీ బాధ్యతలు తీసుకున్నాడు. సౌదీ అరేబియాలో పుట్టిపెరిగిన ఖలీద్ అల్-బటర్ఫీ 1999లో అఫ్గానిస్థాన్‌కు మకాం మార్చాడు. అక్కడ తాలిబన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. 2010లో అల్‌ఖైదాలో చేరాడు. యెమెన్‌లోని అబ్యాన్ ప్రావిన్స్‌ ఆక్రమణలో కీలక పాత్ర పోషించినట్లు అమెరికా తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)